. . . ఒకే డివిజన్ – సిఆర్ కై రెండు జాబితాలు
. . . 13న డిఈఈ, 14న జెఏఓ సంతకంతో జారీ
. . . ఇందులో ఏది నిజం ….?
నిజామాబాద్, బతుకమ్మ:
ఒకే డివిజన్ నుంచి సిఆర్ కోసం రెండు జాబితాలు జారీ అయ్యాయి. ఇందులో ఏది నమ్మాలో తెలియని పరిస్థితి జాబితాలో ఉన్నవారిలో నెలకొంది. లైన్ మెన్ నుంచి లైన్ ఇన్స్పెక్టర్ పదోన్నతి పొందేందుకు సీనియారిటీ ననుసరించి సి ఆర్ (కాన్ఫిడెన్సియల్ రిపోర్ట్, రహస్య నివేదిక) అవసరమై ఉంటుంది. దీనికి గాను జాబితాలో ముందున్న వారిని అనుసరించి పదోన్నతి పొందేవారి పేర్లతో సిఆర్ తీసుకురావాలని డివిజనల్ కార్యాలయం నుంచి అడుగుతుంటారు. ఓ అండ్ ఎం సిబ్బంది కావడంతో వీరి జాబితాను డిఈఈ జారీ చేస్తారు.
సిఆర్ : డిఈఈ పదోన్నతి పొందేందుకు జాబితాలో పేరు ఉన్న లైన్ మెన్ (ఉద్యోగి) ఐదేళ్ళ లోపు తాను పని చేసిన విభాగాలలోని ఏఈల నుంచి సి ఆర్ తీసుకోవాలి. పని చేసినప్పుడు శాఖా పరంగా అవకతవకలకు పాల్పడ్డారా, చర్యలు ఉన్నాయా అని చూసి ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని వారికి ఏఈ పాయింట్లు వేసి ఇస్తారు. దీని తర్వాత సంబందిత సబ్ డివిజనల్ ఏడిఈ కౌంటర్ సంతకం చేసాక, ఆ సిఆర్ ను డిఈఈ కార్యాలయంలోని ఎడిఎం విభాగంలో అందజేస్తారు.
13న డిఈఈ : నిజామాబాద్ డివిజన్ లో ఉన్న రెండు లైన్ ఇన్స్పెక్టర్ పోస్ట్ లను పదోన్నతి పై భర్తీ చేసేందుకు సీనియారిటీ ప్రకారం సి ఆర్ కావాలని కె.శేఖర్ (డి-2 లో ఆపరేటర్), కె.జాషువా (డి-4 లో ఆపరేటర్), కృష్ణ (సుభాష్ నగర్), సాయిబాబా (నవీపేట్), శివగణేష్ (నందిపేట్) పేరిట జాబితాను డిఈఈ జారీ చేసారు.

14న జెఏఓ : ఇదే డివిజన్ నుంచి డిఈఈ అద్వర్యంలో విధులు నిర్వహించే జెఏఓ సంతకంతో 14 న మరో జాబితాను జారీ చేసారు. ఇందులో కె.వేణుగోపాల్ (డి-5 లో ఆపరేటర్), ఎ.సత్యనారాయణ (డి-4 లో ఆపరేటర్), కె.శేఖర్ (డి-2 లో ఆపరేటర్), కె.జాషువా ( డి-4 లో ఆపరేటర్) లతో కూడిన జాబితాను జారీ చేసారు. డిఈఈ హోదా ఉండాలి గాని, పాలన దృష్ట్యా అధికారి పేరు వాడకూడదనే నిబంధన ఉంది. ఇక్కడ జెఎఓ జారి చేసిన దానిలో డిఈఈ హోదాతో పాటు పేరు (ఎం.డి. ముక్తార్)ను వాడారు.

డిఈఈ ఇచ్చిన జాబితాకే ఎసరు? డిఈఈ జారీ చేసిన దానిలో ఐదుగురు పేర్లు ఉండగా, మరునాడు జెఎఓ జారీ చేసిన దానిలో నలుగురి పేర్లు ఉన్నాయి. డిఈఈ ఇచ్చిన జాబితాలో నుంచి ఇద్దరి పేర్లను చేర్చి, మరో ఇద్దరి లైన్ మెన్ పేర్లను చేర్చారు. 14 న డివిజనల్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన జాబితాలో ఉన్న ఒక ఉద్యోగి సుమారు 110 డిడిల కుంభకోణంలో ఇరుక్కోగా, దీనికి శాఖాపరమైన చర్యలలో భాగంగా లైన్ మెన్ నుంచి అసిస్టెంట్ లైన్ మెన్ (ఎఎల్ఎం) పోస్ట్ కు పంపించారు. మళ్ళీ ఏడాది లోపు లైన్ మెన్ గా పదోన్నతి పొంది నగరంలో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మరొకరు ఆపరేషన్ లో లైన్ మెన్ గా చేస్తున్నప్పుడు చేసిన తప్పుడు పనికి గాను సస్పెండ్ అయ్యాడు. ఇంకొకరు తన పరిధిలోని విధులలో ఒకరు చనిపోతే క్రమశిక్షణలో భాగంగా ఇప్పటికి వేతనం నుంచి కోత (డిడక్షన్) విదిస్తుండగా, వచ్చే మార్చ్ మాసాంతానికి పూర్తవుతుందని సమాచారం. ఇలాంటి వారికి సిఆర్ ఎలా ఇస్తారనే చర్చ డివిజన్ పరిధిలో జరుగుతోంది.

అనుమానాలు: డివిజనల్ కార్యాలయం నుంచి జారీ కాబడిన రెండు జాబితాలలో ఏది వాస్తవం. డిఈఈ ఇచ్చిన దానిలో పొరపాటు జరిగినట్లయితే మరునాడు జారీ చేసిన దానిపై డివిజనల్ అధికారి సంతకం ఉండాలి. అలా గాకుండా డిఈఈ పేరుతో సరిపెట్టి, జెఎఓ సంతకంతో జాబితాను బయటకు తీసారు. ఈ విషయం అధికారికి తెలిసి చేసారా..? ఆయనకు తెలియకుండా చేసారా…? అనే అనుమానాలు పవర్ హౌస్ కాంపౌండ్ లోని ఉద్యోగులలో రేకేత్తిస్తున్నాయి.