Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 March 2025, 12:08 pm Posted by : ramakrishna

మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

మార్చి 8న ప్రకటన చేయాలి

పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, బతుకమ్మ : మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డు ఉద్యమాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యాకర్తల నుంచి 10 వేల పోస్టుల కార్డులను సేకరించారు. ఈపోస్టు కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత పంపించారు. హామీల అమలుపై మార్చి 8న ప్రకటన చేయకపోతే 10 వేల మహిళలం 10 వేల గ్రామాల్లోకి వెళ్తామని తెలిపారు. లక్షలాది పోస్టు కార్డులను తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తామన్నారు.  మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని, ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని సూచించారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తు చేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని స్పష్టం చేశారు. వరంగల్ ఎయర్ పోర్టుకు రాణి రుద్రమాదేవీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు… ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్ కు పోలిక లేదని కవిత విమర్శించారు. మహిళలకు నెలకు రూ 2500 ఇచ్చే కార్యక్రమాన్ని, 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని మార్చి 8 నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వడ్డీ లేని రుణాల పరిమితిని రూ 20 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. వడ్డీ రాయితీ బకాయిలు విడుదలతో పాటు రుణ పరిమితిని 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ల మంజూరు చేసి, తక్షణమే పెన్షన్ మొత్తాన్ని రూ 4 వేలకు పెంచాలని కోరారు.అభయ హస్తం నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందన్నారు. నేరాల శాతం 20 శాతం పెరిగాయని డీజీపీ వెల్లడించారని గుర్తు చేశారు. ఆడబిడ్డలకు రక్షణపై ప్రభుత్వం సమీక్షించి ప్రకటన చేయాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను పెంచాలన్నారు. మహిళా కార్మికులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించాలన్నారు. అంగన్ వాడీ కార్మికుల జీతాలను పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఢాంబికాలు పలుకుతోందని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆడపిల్లలకు ఫీజు రియింబర్స్ మెంట్ చేయకపోవడంతో వారి తల్లిదండ్రులు చదువు మానిపిస్తున్నారని ఆరోపించారు.

Promises made to women should be fulfilled