Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 7:43 pm Posted by : ramakrishna

వలస కుటుంబాల జీవనోపాధి బలోపేతానికి ఎంఎంపిటిఎఫ్ కార్యక్రమం పురోగతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

వలస కుటుంబాల స్థితిస్థాపకతను పెంపొందించడం, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడం, సురక్షిత వలసలకు మద్దతు అందించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న మైగ్రేషన్ మల్టీ-పార్టనర్ ట్రస్ట్ ఫండ్ (ఎంఎంపిటిఎఫ్) జాయింట్ ప్రోగ్రామ్ కింద 3వ జిల్లా స్థాయి కమిటీ (డిఎల్ సి) సమావేశం గురువారం నిజామాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి అదనపు జిల్లా కలెక్టర్ (స్థానిక సంస్థలు) సి.వి. భుజంగరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎఫ్ఎఓ, ఐఓఎం ప్రతినిధులు ప్రాజెక్టు పురోగతిని వివరించారు. సిరికొండ, ధర్పల్లి మండలాల్లోని నాలుగు గ్రామాల్లో అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా వాతావరణ మార్పులు, వ్యవసాయ సవాళ్ల ప్రభావానికి గురైన వలస కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వలస కుటుంబాలకు చెందిన 40 మంది మహిళలకు కమ్యూనిటీ ఆధారిత మేకల పెంపకం కోసం 40 మేకల షెడ్లు, 128 మేకలు, 8 సంతానోత్పత్తి మేకపోతులను అందించినట్లు వెల్లడించారు. అలాగే స్వయం సహాయక సంఘాల (ఎస్ హెచ్ జి) సభ్యులకు పేపర్ ప్లేట్ తయారీ, చిన్న దుకాణాల నిర్వహణ, చీరల వ్యాపారం వంటి వ్యవసాయేతర ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి మోసపూరిత ఏజెంట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వలసదారుల ఫిర్యాదుల పరిష్కారానికి పోలీసు శాఖ, జిల్లా న్యాయ సేవా అథారిటీ సహకారంతో మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ (ఎంఆర్ సి) ద్వారా అవసరమైన సహాయం అందిస్తున్నట్లు వివరించారు. వలస కుటుంబాలకు సమాచారం, మార్గదర్శకత్వం, సలహాలు, ఇతర మద్దతు సేవలు అందించేందుకు నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు మొబైల్ మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్‌ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు, ఎఫ్ఎఓ, ఐఓఎం, ప్రాజెక్టు అమలు భాగస్వామ్య సంస్థలు డబ్ల్యూఎఎస్ఎస్ఎఎన్, ఎన్ డబ్ల్యూడబ్ల్యూటి ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంఎంపిటిఎఫ్ కింద జిల్లాలో సాధించిన పురోగతిని కమిటీ సభ్యులు అభినందిస్తూ, కార్యక్రమ విజయవంతానికి అన్ని భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, పరిశ్రమలు, వైద్య & ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, జిల్లా న్యాయ సేవా అథారిటీ, కార్మిక శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు సమావేశంలో పాల్గొని, ప్రాజెక్టు విజయవంతానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

 

Progress of the MMPTF program to strengthen the livelihoods of migrant families.