. పంతం నెగ్గించుకునే దిశలో మిల్లర్లు
. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకునేనా? బస్తాలు మిల్లులకు తరలేనా?

ఇందల్వాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం, రైతులు ధాన్యం రాశుల వద్ద పడిగాపులు కాస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మిల్లర్లు పలు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచడంతోపాటు బ్యాంకు గ్యారెంటీల విషయంలో వెనుకాముందు ఆలోచిస్తున్నారు. మరో వైపు డిఫాల్టర్లకు సీఎంఆర్ కేటాయించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పేరుకుపోతుండడం, శని, ఆదివారాల నుంచి పంటకోతలు ఊపందుకోనున్న నేపథ్యంలో మధ్యేమార్గంగా మిల్లర్లతో ప్రభుత్వం ఓ ఒప్పందానికి వచ్చింది. పది రోజుల వరకు తమకు బాండ్ పేపర్ రాసివ్వాలని, ఆ తరువాత బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించాలని సూచించింది. ఒక విధంగా మిల్లర్ల పంతం నెగ్గినట్టే అయ్యింది. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించి ధాన్యం మిల్లులకు తరలించాలని నిర్ణయించింది. 50 మిల్లులకే సీఎంఆర్ కేటాయించాలని నిర్ణయించిన అధికారులు ఇప్పటి వరకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటాయా? బస్తాలు వెంటవెంటనే మిల్లలకు తరలుతాయా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీపావళి పండుగ ముగిసి అటు మిల్లర్లు, ఇటు రైతులు ఎవరి పనుల్లోకి వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో భారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే కేవలం 50 మిల్లులకే తరలించడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అక్టోబర్ అయిపాయే.. నవంబరొచ్చే..
ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన అధికార యంత్రాంగం అక్టోబర్ లో 3లక్షల మెట్రిక్ టన్నులు, నవంబర్ లో 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి కొనుగోళ్లకు ప్రణాళికను రూపొందించింది. అక్టోబర్ ముగిసి నవంబర్ వచ్చినా కొనుగోలు కేంద్రాల ప్రారంభం తప్ప సేకరణ లేకపోవడంతో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. కొంత మంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించుకున్నారు.
కలెక్టర్ ఆగ్రహం
ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఇందల్ వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. నిల్వ ఉన్న ధాన్యం కుప్పలను చూసిన ఆయన.. ఎప్పటి లోగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు పలు కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ప్రారంభంకాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే మిల్లర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండాచూడాలని అధికారులకు సూచించారు. వర్షం కురిస్తే రైతులు ఇబ్బందులు పడతారన్నారు.
జిల్లాలో రైస్ మిల్లులు 336
జిల్లాలో మొత్తం 336 రైస్ మిల్లులు ఉండగా రా రైస్ 263, బాయిల్డ్ రైస్ మిల్లులు 73 ఉన్నాయి. ఇందులో కస్టమ్ మిల్లింగ్ కు రా రైస్ మిల్లులు 166, బాయిల్డ్ రైస్ మిల్లులు 61 మొత్తం 227 మిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే బ్యాంకు గ్యారెంటీల విషయంలో క్లారిటీ రాకపోవడంతో ఇప్పటికైతే బాండ్ పేపర్లు ఇచ్చి ధాన్యం తరలించేందుకు 50 మిల్లులకు అవకాశం కల్పించారు.
కొనుగోలుకేంద్రాలు 480
జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో 52, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 388, డీసీఎంఎస్ 29, మెప్మా 6, కేపీపీఎస్ఎస్ఎస్ ధ్వర్యంలో 5 మొత్తం 480 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.