నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని బహుజన కాలనీలో తాగునీరు, మురికాలువలు, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నగర కార్యదర్శి బి సుజాత డిమాండ్ చేశారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. నాగారం 80 క్వార్టర్స్ లో దాదాపు 15 సంవత్సరాలుగా అధికారులతో మొరపెట్టుకుంటున్నా శ్మశాన వాటికకు నిదులు కేటాయించలేదని, ఇప్పటికైనా పనులను ప్రారంభించాలని కోరారు. అలాగే దొడ్డి కొమురయ్య నగర్ కు సంబంధించి తాగునీటి, మురికి కాలువల సమస్యలను పరిష్కరించి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. కాలనీల్లో స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏ రమేశ్ బాబు, నగర కార్యవర్గ సభ్యులు కటారి రాములు, నగర కమిటీ సభ్యులు అనిత, అనసూయ స్థానికులు రజియా, రేష్మ, జై శ్రీ సంగీత, జ్యోతి, సునీత, లలిత, విమలబాయి, సంపత, రేఖ తదితరులు పాల్గొన్నారు.
