Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 5:06 pm Posted by : ramakrishna

భద్రతా నియమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

 

. . . టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

ఎడపల్లి, బతుకమ్మ :

 

టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ సర్కిల్ అధికారులతో కలిసి బోధన్ డివిజన్ పరిధిలోని ఎడపల్లి 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఉపకేంద్రంలో చేపట్టిన నిర్వహణ పనులను పరిశీలించిన ఆయన, 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ విద్యుత్ ఉపకేంద్రాన్ని మరో 20 ఏళ్ల పాటు సమర్థంగా పనిచేసేలా అభివృద్ధి చేసిన నిర్మాణ, ఆపరేషన్, సివిల్ విభాగాల అధికారులను అభినందించారు. పర్యటన సందర్భంగా ఎడపల్లి సబ్ డివిజన్ ఇంజనీర్లు, సిబ్బందితో సమావేశమైన సీఎండీ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సాంకేతిక, నిర్వహణ సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. జైతాపూర్, పోచారం ఫీడర్ల పరిధిలో 11 కేవీ లైన్లు అధిక దూరం వరకు విస్తరించి ఉండటంతో బాపునగర్‌లో కొత్త విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరగా, సంబంధిత డీఈ, ఎస్‌ఈలు వెంటనే అంచనాలు (ఎస్టిమేట్లు) సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అలాగే సుమారు 20 ఏళ్ల క్రితం అమలు చేసిన హెచ్‌పీడీఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, ఎల్‌టీ లైన్లలో ట్రాన్స్‌ ఫార్మర్ వైఫల్యాలను తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న పాత ఇనుప విద్యుత్ స్తంభాల స్థానంలో సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల కండక్టర్ ఆధారిత ఎల్‌టీ లైన్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కూడా శాఖ ఆధ్వర్యంలో అదనపు భారం లేకుండా కొత్త విధానంలో లైన్లు, ట్రాన్స్‌ ఫార్మర్లు అందజేస్తున్నామని తెలిపారు. సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న వరుణ్ రెడ్డి, “ప్రాణం అమూల్యమైనది” అని పేర్కొంటూ ప్రతి ఉద్యోగి ‘వన్ మినిట్ రూల్’ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఏ పని ప్రారంభించే ముందు ఒక్క నిమిషం సమయం తీసుకుని భద్రతా అంశాలను పరిశీలించిన తర్వాతే పనిని ప్రారంభించాలని సూచించారు.

 

Priority should be given to safety rules.

 

. . . హనుమాన్ ఫారమ్ 33/11 విద్యుత్ ఉప కేంద్రాన్ని 10 రోజుల్లో చార్జ్ చేయాలి

అనంతరం నవీపేట్ మండలం హనుమాన్ ఫారమ్‌లో నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని పరిశీలించిన సీఎండీ, నిర్మాణ పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ, ఆపరేషన్, సివిల్ విభాగాల అధికారులను అభినందించడంతో పాటు కాంట్రాక్టర్ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ ఉపకేంద్రాన్ని మరో పది రోజుల్లో విద్యుదీకరించి (చార్జ్ చేసి) ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ పీవీ రాజేశ్వరరావు, డీఈ (ఆపరేషన్) ముక్తార్, డీఈ (కన్‌స్ట్రక్షన్) వెంకటరమణ, ఏడీఈ (కన్‌స్ట్రక్షన్) తోట రాజశేఖర్, ఏడీఈ (ఆపరేషన్) పి. ప్రభాకర్, ఏఈ కిషోర్ రెడ్డి, ఈఈ (సివిల్) కె. స్వామి, ఏఈ (కన్‌స్ట్రక్షన్) సుమిత, ఏడీఈ (సివిల్) గుప్తా, ఏఈ (సివిల్) కార్తీక్‌తో పాటు ఎడపల్లి, రెంజల్, బోధన్ రూరల్ ప్రాంతాల విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

 

Priority should be given to safety rules.