Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 6:15 pm Posted by : ramakrishna

ప్రజలకు అందుబాటులో ఉండి స్నేహపూర్వక పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి

 

. . .  బాసర జోన్ 2 డిఐజి భాస్కరన్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

ప్రజలకు అందుబాటులో ఉండే స్నేహపూర్వక పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని బాసర జోన్ 2 డిఐజి భాస్కరన్ పేర్కొన్నారు. బాసర్ జోన్ 2 డిఐజిగా నియమితులైన తర్వాత భాస్కరన్ శనివారం తొలిసారి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేశారు. వారికి పోలీసు గెస్ట్ హౌజ్ వద్ద పోలీసు అధికారులు లాంచనంగా అధికారికంగా స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో బాసర జోన్ 2 పరిధిలోని నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లా స్థాయి అధికారులతో డిఐజి భాస్కరన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించ కుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల పోలీసు అధికారులు, యూనిట్ ఇన్‌చార్జిలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని తమ జిల్లాలకు సంబంధించిన పనితీరు, నేర నియంత్రణ చర్యలు, ఎదురవుతున్న సమస్యలు, చేపట్టాల్సిన కార్యాచరణపై డీఐజీకి వివరించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జగిత్యాల్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీసీపీ శుభం ప్రకాష్, మూడు జిల్లాల అదనపు ఎస్పీలు, రిజర్వ్ విభాగం అధికారులున్నారు.

 

Priority should be given to friendly policing and remaining accessible to the public.