Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2025, 8:25 pm Posted by : ramakrishna

విద్యాభివృద్ధికి ప్రాధాన్యత

  • ఎమ్మెల్యే మదన్ మోహన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని విద్యలో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. విద్యను సమాజ అభివృద్ధికి మూలస్తంభంగా భావిస్తూ, నియోజకవర్గవ్యాప్తంగా పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో రూ.3.5 కోట్ల నిధులతో నిర్మిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) నిర్మాణ పనులను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌లు, అధికారులతో సమావేశమై నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ నాణ్యతపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా, రూ.70 కోట్ల నిధులతో నిర్మిస్తున్న అడ్వాన్స్‌డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. ఇది విద్యార్థులు, యువతకు నూతన అవకాశాల ద్వారాన్ని తెరచుతుందన్నారు, రూ.200 కోట్లతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్” ఏర్పాటుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇది విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు, వసతుల కల్పన కోసం నిధులు విడుదల చేసినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్నదని, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారని పేర్కొన్నారు. “విద్యలో సమానత్వాన్ని సాధించేందుకు, ఆధునిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడం మా ప్రధాన లక్ష్యం. ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం నాణ్యమైన విద్య పొందాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం,” అని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు, కాంట్రాక్టర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, తాజా మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్, మార్కెట్ కమిటీ చైర్మన్, టౌన్ కాంగ్రెస్ నాయకులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Priority for educational development