Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 7:10 pm Posted by : ramakrishna

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి మంగళవారం డీ.ఎల్.పీ.ఓలు, ఎం.పీ.డీ.ఓలు, ఎం.పీ.ఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, పరస్పరం సమన్వయంతో పని చేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లను, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలు ఉంటే  తొలగించాలని ఆదేశించారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదని, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. నిఘా బృందాలను నియమించి, పకడ్బందీగా కోడ్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎక్కడికక్కడ నిరోధించాలని, మద్యం, డబ్బు పంపకాలు, ఇతర ప్రలోభాలకు గురి చేసే వస్తువుల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. ఓటరు జాబితాను మరోమారు నిశితంగా పరిశీలించాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు గమనిస్తే తమ దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమిస్తూ, ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కల్పించేలా శిక్షణ తరగతులను ఇప్పటికే నిర్వహించడం జరిగిందన్నారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని జాగ్రత్తగా సరి చూసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ఎక్కడైనా సదుపాయాలు లేకపోతే యుద్ధప్రాతిపదికన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, టాయిలెట్స్, ఫర్నీచర్, విద్యుత్, లైటింగ్ వంటి వసతులు ఉండేలా చూసుకోవాలని అన్నారు. సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్ల జాబితాను మరోమారు పరిశీలించుకోవాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ తదితర అన్ని ప్రక్రియలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణతో ముడిపడిన అంశాలపై, నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను గడువు లోపు పరిష్కరించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, నోడల్ అధికారులు, డీ.ఎల్.పీ.ఓలు పాల్గొన్నారు.  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముందు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బోధన్ ఎంపిడిఓ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధతను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎంపిడిఓ కిషోర్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Preparations for conducting Gram Panchayat elections