మోర్తాడ్, బతుకమ్మ :
భీంగల్ పట్టణంలో అభివృద్ధి పనుల పూర్తిపై డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేపట్టనున్న ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు మోర్తాడ్ మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నాయకుల వివరాల ప్రకారం, భీంగల్‌లో గత ప్రభుత్వ హయాంలో ప్రశాంత్ రెడ్డి మంజూరు చేసిన అభివృద్ధి పనుల్లో సుమారు 70 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి, మార్కెట్, సీసీ రోడ్ల వంటి కీలక పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. భీంగల్ మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మూడు నెలల్లో అన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు పనులు పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. కేవలం ప్రకటనలతో కాలయాపన చేయకుండా రూ.5 కోట్లు మంజూరు చేసి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిలువరించే చర్యల్లో భాగంగా మోర్తాడ్ మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కళ్లెడ ఎలియా, పాపాయి పవన్, గంధం మహిపాల్, కడారి శ్రీనివాస్, యూసుఫ్, శిరవేణి శివకుమార్, ధని మహేందర్, దంతే వినయ్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై పార్టీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రజా సమస్యలపై చేపట్టే నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు.