Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 8:03 pm Posted by : ramakrishna

పీఆర్సీ, డీఏలు వెంటనే ప్రకటించాలి

 

. . . టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల లింగం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయాలని టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల లింగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని కోరారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యలపై ఆయన మాట్లాడారు. యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో చేపట్టిన నాలుగు దశల ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఆగస్టు 12, 13 తేదీల్లో మండలంలోని తహసీల్దార్లకు సమస్యలపై మెమోరాండాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 29న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు మహాధర్నాకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చింతల లింగం పిలుపునిచ్చారు. ఉద్యమాలు చేపట్టడం ద్వారానే తమ సమస్యలను సాధించుకోగలమని అన్నారు. 317 జీవోను అమలు చేసి 317 కేటగిరీలోని ఉపాధ్యాయులను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఈహెచ్‌ఎస్ సమస్యను పరిష్కరించి, సాధ్యమైనంత త్వరగా హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సీనియర్ నాయకులు కందుకూరి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు తృప్తి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి అంజయ్య, గాంధారి మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.