- ప్రమోద్ కుటుంబానికి సీఎం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా
- రియాజ్ ఎన్ కౌంటర్ కేసులో విచారణ జరుగుతుంది
- పొరుగు జిల్లా అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించాం
- డీజీపీ శివధర్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : ప్రమోద్ అసలైన పోలీసు. విధి నిర్వహణలో ప్రాణాలు ఆర్పించాడని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ ప్రమోద్ కుటుంబానికి పోలీసు శాఖ తరపున సానుభూతి ప్రకటించారు. ప్రమోద్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారని, వాటిని కుటుంబానికి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలం ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. ప్రమోద్ ను హత్య చేసిన రియాజ్ ఎన్ కౌంటర్ కేసు విచారణ జరుగుతుందన్నారు. విచారణ బాధ్యతలను పొరుగు జిల్లా అధికారికి అప్పగించినట్లు డీజీపీ పేర్కొన్నారు.
- తెలంగాణలో మరో 65 మంది అజ్ఞాతంలో ఉన్నారు..
తెలంగాణకు చెందిన 65 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టులు నిర్భయంగా లొంగిపోవాలని కోరారు. పోలీసు, రెవెన్యూ, మీడియా ఆధ్వర్యంలోనూ వారు లొంగిపోయినా ప్రభుత్వం తరపున అందజేయాల్సిన రివార్డును అందిస్తామని తెలిపారు. ఇప్పటికే దండకారణ్యంలో పని చేస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీసు కమిషనర్ సాయిచైతన్యలు పాల్గొన్నారు.