Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 7:43 pm Posted by : ramakrishna

అధినేతల మధ్య ఆధిపత్య పోరు

 

. . . అనుచరులకు పదవుల కోసం పట్టు

 

. . . డీసీసీబీ, ఐడీసీఎంఎస్, మార్కెట్ కమిటీ పోస్టుల కోసం లీడర్ల ప్రయత్నాలు

 

. . . నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కీలక పోస్టుల కోసం అధికార పార్టీలో ముసలం

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు దశాబ్ధ కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం అధినేతల మధ్యనే ఆధిపత్య పోరుకు దారితీసింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నిజామాబాద్ జిల్లాలో డీసీసీబీ, ఐడీసీఎంఎస్ లకు పాత పాలకవర్గాలను తప్పించి కొత్త వారికి, అప్పటికే ఉన్న వారిని తమ పార్టీలోకి చేర్చుకుని కొనసాగించారు. రెండు కీలక పాలకవర్గాలకు పదవి కాలం ముగియగా కొత్త వారిని ఎంపిక చేయడం కత్తిమీద సాములా మారింది. ఎందుకంటే అక్కడ పదవులను తమ అనుచరులకు ఇచ్చేందుకు నిజామాబాద్ జిల్లాలో కీలక నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు, రాష్ట్ర పీసీసీ కోశాధికారి పొద్దుటూరి  సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలు తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు సై అంటూ సై అంటున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇటీవల ఎస్టీకి రిజర్వు అయ్యింది. ఇది వరకే ఐడీసీఎంఎస్, డీసీసీబీల పాలకవర్గాల పదవి కాలం ముగియడంతో ఆ స్థానాలపై ముగ్గురు నేతలు కన్నేశారు.

Power struggle between leaders

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కోసం ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలు తమ అనుచరులకు పదవులు కావాలని ప్రయత్నాలు ముమ్మురం చేసుకున్నారు. రాష్ట్రంలో దశాబ్ధం తర్వాత అధికారంలోకి వచ్చిన  కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల వ్యవహరంలో నిజామాబాద్ జిల్లాలో కీలకనేతల మధ్యనే పోరుకు దారితీసింది. సలహాదారులు సుదర్శన్ రెడ్డి తాజామాజీ కుంట రమేష్ రెడ్డి కోసం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పురాణ్ రెడ్డి కోసం, రూరల్ ఎమ్మెల్యే మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి కోసం పదివిని  ఇప్పిస్తామని గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు శాయశక్తులను ఒడ్డుతున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవి కీలకం కావడంతో తమ అనుచరులనే కుర్చీ మీద కూర్చుండబెట్టేందుకు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతున్నారు.

Power struggle between leaders

ఇందూర్ డిస్ట్రిక్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (ఐడీసీఎంఎస్) పదవి కోసం ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రస్తుత తాజామాజీ తారాచంద్ నాయక్ తనకు మరోసారి కొనసాగించే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుత నిజామాబాద్ సిటీ డీసీసీబీ ప్రెసిడెంట్ బొబ్బిలి రామక`ష్ణకు పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారా చంద్రమోహన్ తనకు ఐడీసీఎంఎస్ పదవి వస్తుందని ధీమాతో ఉన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను టికెట్ రేసులో ఉన్నప్పటికీ త్యాగం చేశానని అధికార పార్టీ అగ్రనేతలు ఇచ్చిన హామీ మేరకు తనకు పదవి దక్కుతుందని ధీమాతో ఉన్నారు. ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవి గతంలో డీసీసీబీ నిజామాబాద్ కు ఇస్తే కామారెడ్డికి ఐడీసీఎంఎస్ పదవి ఇచ్చే వారు. అయితే జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన జిల్లాలో డీసీసీబీలు, ఐడీసీఎంఎస్ ల ఏర్పాటు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నేతలు ఆ పదవి కోసం పట్టుబడుతున్నారు.

Power struggle between leaders

ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా పేరుగడించిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొత్త మొఖాలు తెరపైకి వచ్చాయి. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇటీవల వరకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అనుచరుడు ముప్ప గంగారెడ్డి రెండు సంవత్సరాల పదవి కాలం ముగిసిన తర్వాత నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఎస్టీకి  రిజర్వు అయింది. ఈ నేపథ్యంలో గిరిజనుల కోటాలో కీలక నేతలు పోటీపడుతున్నారు. మాజీ ఎంపీపీ, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు కేతావత్ యాదగిరి, మాజీ జడ్పీటీసీ కేతావత్ మోహన్, మెంట్రాజ్ పల్లి మాజీ సర్పంచ్ అంబర్ సింగ్, నిజామాబాద్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ సుభాష్ జాదవ్ లు పోటీ పడుతున్నారు. అయితే కేతావత్ యాదగిరి సంబంధిత పోస్టు కోసం ముందు వరుసలో ఉన్నారని పార్టీలో చెబుతున్నారు. పార్టీ కోసం కట్టుబడి ఉండి అహర్నిశలు పని చేసిన తనకే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వస్తుందని ధీమాతో ఉన్నారు.