Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 11:23 am Posted by : ramakrishna

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు కరెంట్ కట్

 

. . . కరెంట్ లేక నిలిచిపోనున్న ఆన్ లైన్ ఈ నామ్ సేవలు

. . . అంధకారంలో కి మార్కెట్ యార్డు

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

తెలంగాణలో పేరెన్నిక గన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు విద్యుత్ శాఖ కరెంట్ కట్ చేసింది. సుమారు రూ.16 లక్షల విద్యుత్ బకాయిలు చెల్లించక పోవడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు. బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇస్తే మార్కెట్ యార్డు అధికారులు చెక్ లు ఇచ్చిన  వారికి ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో కరెంట్ అధికారులు ఆదివారం  విద్యుత్ సరఫరాను తోలిగించారు. దానితో మార్కెట్ యార్డులో జరిగే క్రయ విక్రయాల పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గత నెలలో ఈ నామ్ 0.1 పని చేయలేదని పసుపు రైతులు మార్కెట్ యార్డు ను ముట్టడించారు. దానిని పునరుద్ధరించి రైతులకు దళారులు లేకుండా పసుపు విక్రయాలు చేస్తుంటే ఇప్పుడు కరెంటు కోతలు ఇబ్బందికరంగా పరిణమించాయి. అంతే కాకుండా మార్కెట్ యార్డు రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులు చోరీకి గురైన సంఘటన  లు ఉన్నాయి. ఈ విషయం లోను రైతులకు, మార్కెట్ యార్డులో వ్యాపారులకు గొడవలు జరిగాయి. ఇప్పుడు కరెంట్ లేకపోతే దాదాపు 70 సీసీ కెమెరాలు పనిచేయకుండా పోయాయి. సెక్యూరిటీ గార్డులు ఉన్న వారి సేవలు అంతట ఉండలేని పరిస్థితి నెలకొంది.

Power cut to Nizamabad agricultural market yard

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు కు నిధుల కొరత లేదు. రైతులు విక్రయించే పంట ఉత్పత్తుల పై మార్కెట్ ఫీజు రూపేనా ప్రతి ఏడాది కోట్ల ఆదాయం ఉంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు కు సంబంధించిన డబ్బులు ఇతర మార్కెట్ యార్డులకు తరలించిన చరిత్ర ఉంది.అయితే గత నవంబర్ నుంచి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి విద్యుత్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు రూ.16 లక్షలు సంబంధించిన చెక్ ని యార్డు అధికారులు విద్యుత్ శాఖకు అందించారు.2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు  మార్చి 31 వరకు ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేకుండే. కానీ ఏప్రిల్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వక వారికి జిల్లా ట్రెజరీ నుంచి అప్రూవల్ రావడం లేదు. వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు ఇచ్చిన చెక్ లు ఉన్న వాటికి ఫలితం లేదు. దానితో నెల రోజులుగా విద్యుత్ శాఖా అధికారులు బిల్లుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. కానీ ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి సంబంధిత క్లియరెన్స్ లేకపోవడంతో వారు చేతులు ఎత్తివేశారు. దానితో ఆదివారం విద్యుత్ శాఖ కరెంట్ కట్ చేశారు.ఈ విషయమై నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు  కార్యదర్శి అపర్ణను వివరణ కోరగా కరెంట్ సరఫరా నిలిపి వేసిన విషయం వాస్తవమే అన్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆదివారం కాబట్టి యార్డుకు సెలవు ఉండడంతో పెద్దగా ప్రభావం లేదని అయితే రాత్రి వరకు కరేంట్ పునరుద్ధరించకపోతే అందకారంలో ఉండటం ఖాయం. విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడుతున్నట్టు తెలిసింది.