- అర్ధరాత్రే జిల్లా కేంద్రానికి రవాణా
- ఒక టిప్పర్ కు ఎస్ హెచ్ వోకు రూ.8 వేలు
- ఏఎస్సైకు, కానిస్టేబుల్ కు చెరో రూ.500
- ఎస్కార్ట్ ద్వారా నిత్యం 15 టిప్పర్ల ద్వారా రవాణా
- వర్ని రోడ్డులో డంపింగ్.. క్రయవిక్రయాలు..
- వే బిల్లు ద్వారా ఇసుక అమ్మకాలు చేస్తున్న వ్యాపారులకు ఖాకీల బెదిరింపులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇసుక రీచ్ లకు అనుమతులు లేవు. ఉన్నదల్లా కేవలం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వ పనుల అవసరాలకు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో మంజిరా పరివాహక ప్రాంతంలోనే ఇసుక తవ్వకాలకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అందులో కోటగిరి, పోతంగల్, సాలురా మండలాల నుంచే ఇసుక రవాణా స్థానిక అవసరాలకు తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే కొందరు రాత్రేవేళ ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. ఏకంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికే పోతంగల్ ఇసుక తరలివస్తుంది. అట్లా ఇట్లా కాకుండా రాజమార్గంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు 15 టిప్పర్లలో ఇసుక జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు సులేమాన్ ఫారంకు చెందిన ఇసుక వ్యాపారులు. ఏకంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సరిహద్దు పోలీస్ స్టేషన్ లో అధికారులకు ముందస్తు మామూళ్ళు మాట్లాడుకుని పక్కా ఎస్కార్ట్ తో రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఇసుకను తరలిస్తున్నారు.
ఉమ్మడి కోటగిరి మండలంలోని పోతంగల్ నుంచి ఇసుక జిల్లా కేంద్రానికి తరలివస్తుంది. జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్డు ప్రాంతానికి చెందిన ఇసుక వ్యాపారి సులేమాన్ ఫారంకు చెందిన ఇసుక రవాణాదారులతో ముందస్తు చేసుకున్న ఒప్పందంతో నిత్యం ఇసుక తరలివస్తుంది. బీజేపీ నాయకుడిగా చెలామణి అవుతున్న సదరు వ్యాపారి నిత్యం పోతంగల్ నుంచి రాత్రి అయిందంటే ఇసుకను తరలిస్తున్నారు. ఎలాంటి వే బిల్లులు లేకుండా స్థానికంగా పోతంగల్, కోటగిరి మండలాల్లోని ఇందిరమ్మ ఇండ్లకు, ప్రభుత్వ పనులకు, హైవే పనుల కోసం ఇసుక తవ్వకాలు చేస్తున్నామని తహసీల్ధార్ల ద్వారా ట్రాక్టర్లలో ఇసుకను తీసుకువచ్చి నదిఒడ్డు ప్రాంతాల్లో డంపింగ్ చేసి రాత్రివేళల్లో రుద్రూర్, వర్ని మీదుగా జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. స్థానికంగా వర్ని రోడ్డులోని పోలీస్ స్టేషన్ ల అధికారులతో ముందస్తు ఒప్పందాలతోనే ఇసుక తరలివస్తున్నట్లు సమాచారం. ఒక టిప్పర్ కు రూ.8 వేలు, రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించే ఏఎస్సైకి రూ.500, కానిస్టేబుల్ కు మరో రూ.500 చొప్పున అప్పటికప్పుడు చెల్లింపులు జరిపి ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక టిప్పర్ల ముందుగా ఎస్కార్ట్ గా కార్లలో వస్తూ ఇసుకను జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. వర్ని రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో డంప్ చేసి అక్కడి నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక తరలింపులో వే బిల్లులు లేకపోయినా పట్టుకోకపోవడానికి అధికారులకు అమ్యామ్యాలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వే బిల్లుల ద్వారా కాళేశ్వరం నుంచి వస్తున్న ఇసుక ధర ఖరీదు అని ఇసుక వ్యాపారులు జీరో వే బిల్లుల ఇసుకను సేకరిస్తున్నారు. అందుకు మంజిరా పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే ఇసుకను వాడుతున్నారు. వర్నిరోడ్డు మీదుగా లేకపోతే కుర్నాపల్లి మీదుగా అలీసాగర్ నుంచి బోధన్ రోడ్డులో ఇసుకను తరలించడం జరుగుతుంది. ఇసుక తరలించే సమయంలో ఇటీవల స్థానిక 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు రాత్రివేళ టిప్పర్ ను దానికి ఎస్కార్ట్ గా వస్తున్న కారును సీజ్ చేసిన ఇసుక దందా మాత్రం ఆగడం లేదు. రాత్రివేళ వర్నిరోడ్డులో ఒక చౌరస్తా వద్ద మొబైల్ (పెట్రోలింగ్) లో విధులు నిర్వహించే వారికి అప్పటికప్పుడు మామూళ్ళు ఇచ్చి ఇసుకను జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం నుంచి తీసుకువచ్చిన ఇసుకను విక్రయించేందుకు యత్నించేవారిని జీరో వే బిల్లుల ద్వారా ఇసుకను అక్రమ రవాణా, డంపింగ్ చేసి విక్రయిస్తున్న వ్యాపారులే బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ఈ విషయంలో పోలీసులే జీరో ఇసుక దందా చేస్తున్న వారికి మద్దతుగా ఇతర వ్యాపారులను బెదిరించినట్లు విశ్వసనీయ వర్గాల బొగట్టా. ఇటీవల మంజిరాకు వరదలు వచ్చినా ఇసుక రవాణా మాత్రం ఆగడం లేదు. ఇసుకను వర్ని రోడ్డులో డంప్ లలో నిల్వ చేసి ఎలాంటి వే బిల్లు లేకుండా నగరంలో దర్జాగా విక్రయిస్తున్న రెవెన్యూ అధికారులు గానీ, పోలీసు అధికారులు కానీ పట్టించుకోకపోవడం విశేషం.