Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 10:18 pm Posted by : ramakrishna

మరోసారి వాయిదా..?

  • మంత్రి వర్గ విస్తరణకు సమయం పడుతుందన్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • మైనార్టీకి అవకాశం ఉంటుందని..
  • ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు ప్రకటన
  • షబ్బీర్ అలీకి ఛాన్స్ ఉంటుందంటున్న మైనార్టీలు

నిజామాబాద్, బతుకమ్మ: రాష్ర్ట మంత్రి వర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడినట్లే కనిపిస్తోంది. ఈనెల 3వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, అదే రోజు నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించినప్పటికీ ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేసినట్లు కనిపించడం లేదు.  పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేననేందుకు బలాన్ని చేకూర్చాయి. మొత్తం ఆరుగురు నూతన మంత్రలను నియమించాల్సి ఉండగా, ఈ అంశం ఏఐసీసీ పరిధిలో ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అవి తొలగిపోయిన తరువాతే ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అయితే విస్తరణలో మైనారిటీకి తప్పకుండా అవకాశం ఉంటుందని స్పష్టం చేసిన ఆయన, ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని తాము కోరినట్లు తెలిపారు.

  • షబ్బీర్ భాయ్ కి లైన్ క్లియర్..?

మైనారిటీ కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని మొదటి నుంచి షబ్బీర్ అలీ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయన అనుచరులు సైతం షబ్బీర్ భాయ్ మంత్రి అవుతారని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి కూడా దక్కుతుందని, ఆ తరువాత మంత్రి అవుతారని అనుకున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ నియామకాల సమయంలో షబ్బీర్ ను పక్కన పెట్టడంతో ఆయన అనుచరులు అవాక్కయ్యారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ లో ధర్నా సైతం చేశారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు చేసిన ప్రకటన షబ్బీర్ తోపాటు ఆయన అనుచరుల్లో మళ్లీ ఆశలను చిగురింపజేసింది.  ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ కు ఇక మంత్రి పదవి దక్కడం ఖాయమని అంటున్నారు.

డైలామాలో పెద్దాయన.. ఆయన అనుచరులు

మంత్రి వర్గ విస్తరణలో ఆరుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని, అయితే అందులో ఒకరు మైనారిటీ కచ్చితంగా ఉంటారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ ప్రకటించారు. అలాగే ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీని కోరారు. ఈ లెక్కన మూడు పదవులు పోతే.. మిగతా మూడు పదవులు ఎవరిని వరిస్తాయనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణ రేసులో జిల్లాకు చెందిన సీనియర్ సుదర్శన్ రెడ్డి తోపాటు ఆయా జిల్లాలకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, శ్రీహరి ముదిరాజ్, మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, ఉన్నారు. వీరిలో వివేక్, శ్రీహరి మినహా మిగతా అందరూ అగ్రకులాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్ తోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడంతో ఏ జిల్లాలకు అవకాశం దక్కుతుందనేదానిపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి వర్గంలో బెర్త్ ఖాయమని అంతా భావిస్తున్నా.. అధిష్టానం స్థాయిలో లెక్కలు ఏ మేరకు ఆయనకు కలిసి వస్తాయో వేచి చూడాల్సిందే.