నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా “స్మారకోపన్యాసం ” సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు మల్లికార్జున్ ,ఆకుల అరుణ, జన్నారపు రాజేశ్వర్ లు కోరారు. నిజామాబాద్ నగరంలో పిడిఎస్ యు, పివైఎల్, పి ఓ డబ్ల్యూ, ఇప్టూ, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుట్టలో గొర్రెపాటి మాధవరావు స్మారకోఉపన్యాస సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గొర్రెపాటి మాధవరావు స్మారకోపన్యాసం సభ కుముఖ్య వక్త లు గా నల్సార్ న్యాయ శాస్త్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీ కృష్ణ దేవరాజు ,మానవ హక్కుల వేదిక , ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు యం.రాజేందర్ రెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ ఆకుల పాపయ్య, నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆకుల రమేష్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ల సాయి రెడ్డి హాజరవుతారని తెలిపారు. మాధవరావు హక్కులు లేని అణిచివేతకు గురయ్యే వర్గాల పట్ల ఆరాటాన్ని తన జీవిత ఆచరణలో భాగం చేసుకున్నారు. ఎన్నో ఎన్ కౌంటర్ హత్యలు, లాకప్ మరణాలను పరిశీలించి అవి ఎట్లా చట్ట వ్యతిరేకమో విశ్లేషించాడు. కోర్టులో వాటిని సవాల్ చేసి దేశంలో అరుదుగా నమోదయ్యే ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చి తీర్పులను రాబట్టాడు. తన జీవితాంతం హక్కుల అణిచివేతకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేశారు. మానవ హక్కుల సంస్కృతి మానవాళి నిజమైన అభివృద్ధి అని నమ్మి పనిచేశాడు. కావున ప్రజాస్వామ్యవాదులు, కార్మికులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సాయి రెడ్డి, జి పి గంగాధర్,సాయినాథ్,దాసు, గంగాధర్, మోహన్ ,శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరైనారు.