. . . జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 లోని నిబంధనల ప్రకారం, ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండటం, తప్పుడు సమాచారం ఇవ్వడం శిక్షార్హమైన నేరాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకోవడానికి చట్టపరంగా అర్హుడు కాదని స్పష్టం చేశారు. సెక్షన్ 18 ప్రకారం ఏ వ్యక్తి కూడా ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా ఒకసారి కంటే ఎక్కువ ఓటరుగా నమోదు చేసుకోకూడదని సూచించారు. సెక్షన్ 31 ప్రకారం ఓటర్ల జాబితా తయారీ, సవరణ, పేర్ల నమోదు లేదా తొలగింపుల సమయంలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని, లిఖితపూర్వక డిక్లరేషన్‌ను సమర్పిస్తే, అది తీవ్రమైన నేరంగా పరిగణించ బడుతుందని అన్నారు. అటువంటి వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా ఈ రెండూ విధించబడతాయని తెలిపారు. ఓటర్లందరూ ఈ చట్టపరమైన నిబంధనలను విధిగా పాటించాలని, ఎవరికైనా ఒకటి కంటే ఎక్కువ ఓట్లు లేదా వేర్వేరు ప్రాంతాలలో ఓట్లు ఉన్నట్లయితే, వెంటనే ఫారమ్-7 ద్వారా అదనపు ఓట్లను తొలగించుకోవాలని కలెక్టర్ సూచించారు.