. . . తెలంగాణలో విస్తరణకు ఆసక్తి చూపిన సంస్థ
హైదరాబాద్, బతుకమ్మ :
హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఎ 380 విమాన సర్వీసులను ప్రారంభించే అంశంపై ఆ సంస్థ సానుకూలంగా స్పందించింది. ఎమిరేట్స్ విమానయాన సంస్థ (ఇండియా – నేపాల్) వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హన్ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధి, కొత్త అవకాశాలపై చర్చించారు. హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ ఎ 380 సర్వీసులను ప్రారంభించడంతో పాటు, సంస్థ విమాన సేవలను మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ప్రతిపాదిత కొత్త విమానాశ్రయాల ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, విమాన సర్వీసులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే తెలంగాణలో ఎమిరేట్స్ సంస్థ ఎంఆర్ఓ కార్యకలాపాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక, సాంకేతిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎమిరేట్స్ సంస్థ స్పాన్సర్ షిప్ అందించాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. క్రీడా రంగ ప్రోత్సాహానికి సంస్థ భాగస్వామ్యం కావాలని సూచించారు. ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తులపై మహమ్మద్ సర్హన్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ సేవలను ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తామని, అలాగే క్రీడాకారుల ప్రోత్సాహానికి స్పాన్సర్‌షిప్ అందించే విషయంపైనా సానుకూల దృక్పథంతో ఉన్నామని తెలిపారు.