బిచ్కుంద, బతుకమ్మ : ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అందజేస్తున్న రేషన్ బియ్యం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలంలో పక్కదారి పడుతున్నాయి. తరచూ టాస్క్‌ఫోర్స్, పౌరసరఫరాల శాఖ, పోలీస్ శాఖ దాడులు నిర్వహిస్తున్నా దందా ఆగడం లేదు. కాగా బిచ్కుంద మండలకేంద్రంతో పాటు గుండెకల్లుర్ గ్రామంలో రేషన్ దుకాణాల్లో భారీ ఎత్తున బియ్యం పక్కదారి పడుతుందని సదరు ఆ రేషన్ డీలర్ పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుండెకల్లుర్ గ్రామంలో 39 క్వింటాళ్ల 66 కిలోలు వ్యత్యాసం ఉన్నట్లు డీటీసీఎస్ అధికారి ఖాలిద్ ఖాన్ తెలిపారు. కాగా బిచ్కుంద మండలకేంద్రంలో షాప్ నెంబర్ 20 లో కూడా అక్రమాలు జరిగాయని పలువురు అంటున్నారు. అంతేగాకుండా సదరు ఈ డీలర్ ప్రజల నుంచి వేలిముద్రలు తీసుకొని బియ్యం ఇవ్వలేదని జనాలు గుసగుసలాడుకుంటున్నారు. బిచ్కుంద మండలకేంద్రంలో తనిఖీలు చేపడదాం అనేసరికి సదరు ఆ డీలర్ ఫొన్ స్విచ్చాఫ్ చేసి అందుబాటులో లేడని ఆయన అన్నారు. గతంలో కూడా ఈ డీలర్ పై అభియోగాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. అక్రమాలకు పాల్పడిన సదరు ఆ రేషన్ డీలర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
