నిజామాబాద్, బతుకమ్మ: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందిస్తూ ఎంతోమందిని దేశభక్తులకు తీర్చిదిద్దుతూ స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
విద్యార్థి సంఘాలు అంటే కేవలం ఆందోళనలు అనే సంస్కృతి ఉండేదని, 1949లో ఏబీవీపీ ఆవిర్భావం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇందులో భాగంగానే పాలిటెక్నిక్ ఉచిత బోధన తరగతులు నిర్వహిస్తోందన్నారు. 1982లో కేవలం రెండు కేంద్రాలతో ప్రారంభమైన బోధన తరగతులు నేడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు.
వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖలీల్ వాడీలోని ఎస్ఎస్ ఆర్ జూనియర్ కళాశాలలో శిక్షణ తరగతులు కొనసాగుతాయన్నారు. సమావేశంలో నగర కార్యదర్శి బాల కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేందర్, కంఠేశ్వర్ జోనల్ ఇన్ చార్జి దుర్గా దాస్, రంజిత్, అభినవ్, ఇంద్రసేన, జయేంద్ర వర్ధన్, అలంకార్, తేజ తదితరులు పాల్గొన్నారు.