. . . పీ.ఓలు, ఏ.పీ.ఓ ల శిక్షణ తరగతుల్లో అబ్జర్వర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సమర్ధవంతంగా బాధ్యతతో విధులు నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో పీ.ఓ లు, ఏ.పీ.ఓ లు, ఓ.పీ.ఓ లకు పోలింగ్ నిర్వహణ విధులపై మాస్టర్ ట్రైనర్ చే శనివారం అవగాహన కల్పించారు. శిక్షణ తరగతులను సందర్శించిన సందర్భంగా అబ్జర్వర్ పీ.ఓ లు, ఏ.పీ.ఓలకు కీలక సూచనలు చేశారు. హ్యాండ్ బుక్ లో పొందుపర్చిన అంశాలను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధులపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకళింపు చేసుకోవాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు పూర్తయ్యేలా జాగ్రత్తగా ఎన్నికలు జరపాలని సూచించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను సైతం ఎన్నికల పరిశీలకులు సీహెచ్ సత్యనారాయణ రెడ్డి సందర్శించారు. కలెక్టరేట్ లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించారు. అబ్జర్వర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఉన్నారు.
