. . . సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా సదస్సులో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తోందని విమర్శించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేస్తోందన్నారు. నాలుగు లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికుల హక్కులు తీవ్రంగా దెబ్బతింటాయని, పని దినాన్ని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడంతో పాటు సమ్మె హక్కుపై ఆంక్షలు విధించారని పేర్కొన్నారు. కార్మిక సంఘాల నమోదు కఠినతరం చేయడం, ఉద్యోగ భద్రతను బలహీనపరచడం, “హైర్ అండ్ ఫైర్” విధానాన్ని అమలు చేయడం, కనీస వేతనాల నిర్ణయ విధానాన్ని నిర్వీర్యం చేయడం వంటి చర్యలు కార్మిక వ్యతిరేకమని అన్నారు. భవన నిర్మాణం, హమాలీ, బీడీ, రవాణా తదితర అసంఘటిత రంగాల కార్మికులతో పాటు అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం వంటి స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నాలుగు లేబర్ కోడ్‌లను పూర్తిగా ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో స్వేచ్ఛా వాణిజ్య విధానాల కారణంగా రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, కార్పొరేట్ సంస్థలకే లాభాలు చేకూరే విధంగా విధానాలు అమలవుతున్నాయని ఆరోపించారు. అలాగే విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్ట సవరణలు రైతాంగానికి, సామాన్య ప్రజలకు భారంగా మారతాయని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేసి “వికసిత్ భారత్ గ్రామ్ జీ” పేరుతో కొత్త విధానాన్ని తీసుకురావడం వల్ల రాష్ట్రాలపై 40 శాతం నిధుల భారం పడుతుందని, ఉపాధి హామీ పథకం బలహీనపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అలాగే అంత్యోదయ ఆహార భద్రత పథకంలో ప్రతి కుటుంబానికి 35 కిలోల బియ్యం ఇచ్చే విధానాన్ని రద్దు చేసి వ్యక్తికి 7 కిలోల చొప్పున పరిమితం చేయడం వల్ల లక్షలాది మంది లబ్ధిదారులు నష్టపోతారని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పటికీ కేంద్రం చట్ట సవరణల ద్వారా తన ఆధీనంలోకి తీసుకువస్తోందని, దీని ప్రభావం రైతులు, మధ్యతరగతి ప్రజలపై అధిక భారంగా పడుతుందని తెలిపారు. దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 10న నిర్వహించే “జైలు భరో” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఏ. రమేష్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట రాములు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి. వెంకటేష్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జంగం గంగాధర్, నన్నే సాబ్, లక్ష్మి, శ్రీనివాస్, ఎల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు భూలక్ష్మి, సాయిలు, రైతు సంఘం నాయకులు దేవేందర్ సింగ్, ముత్తన్న, వృత్తి సంఘాల నాయకులు సాయిలు, నర్సింలు, శేఖర్ గౌడ్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్పలింగం, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, వికలాంగుల సంఘం జిల్లా కార్యదర్శి వై. గంగాధర్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
