కామారెడ్డి, బతుకమ్మ :
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 374 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి శిక్షలు విధించింది. ఈ సందర్భంగా మొత్తం రూ.4,06,400 జరిమానా విధించగా, నిబంధనలు ఉల్లంఘించిన 20 మందికి జైలు శిక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, సమాజ భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని కామారెడ్డి పోలీసులు స్పష్టం చేశారు.