Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 7:17 pm Posted by : ramakrishna

బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

 బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మంగళవారం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముందుగా గౌరవ వందనం స్వీకరించిన అనంతరం యూనిఫాం టర్న్ అవుట్, కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. అనంతరం ఏసీపీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి, వివిధ రకాల ఫైళ్లను తనిఖీ చేసి పోలీస్ విభాగం పనితీరును సమీక్షించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై నాణ్యమైన దర్యాప్తు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై పాఠశాలలు, కళాశాలలు, సోషల్ మీడియాలో అవగాహన కల్పించాల్సిందిగా ఆదేశించారు. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరించే దిశగా విలేజ్ పోలీస్ ఆఫీసర్ల పాత్రను ప్రాధాన్యతగా ప్రస్తావించారు. మహారాష్ట్ర సరిహద్దు వరకు ఈ పోలీస్ స్టేషన్ పరిధి ఉండటంతో సరిహద్దు ప్రాంతాలపై కఠిన నిఘా పెట్టాలని, అక్కడి పోలీస్ సిబ్బందితో సమన్వయం పెంచుకోవాలని సూచించారు.

Police Commissioner inspects Bodhan Rural Police Station

ట్రాఫిక్ నియంత్రణకు ముఖ్య కూడళ్లలో ఎన్ఫోర్స్‌మెంట్ నిర్వహించాలనీ, రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్స్, గేమింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న మోసాలపై ప్రజల్లో జాగృతి కల్పించాలని సూచించారు. సిబ్బంది ఎల్లప్పుడూ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని, ప్రతి ఆరు నెలలకు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీ పి. శ్రీనివాస్, రూరల్ సీఐ శ్రీ విజయ్ బాబు, ఎస్హెచ్ఓ వెంకట నారాయణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, రూరల్ జె. మచ్చేందర్, ఏడపల్లి ఎస్సై రమ, రెంజల్ ఎస్సై చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Police Commissioner inspects Bodhan Rural Police Station