బాన్సువాడ, బతుకమ్మ : నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి గురుకుల వసతి గృహ విద్యార్థినుల విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో విద్యార్థినులతో కలిసి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రయాణం చేశారు. ఈ నెల 14వ తేదీ ఉదయం బాన్సువాడ పట్టణం నుంచి తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తుండగా మార్గ మధ్యంలో బాన్సువాడ – నిజామాబాద్ ప్రధాన రహదారి దుర్కి శివారులో గల ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల వద్ద రహదారిపై బాన్సువాడ వైపు వెళ్లవలసిన బస్సు కొరకు నిలబడి ఉన్న విద్యార్థినులను గమనించి తక్షణమే బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్ తో ఫోన్లో మాట్లాడి ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గురువారం ఆకస్మికంగా బస్సు సర్వీసులను తనిఖీ చేసి విద్యార్థినిలతో పాటు బాన్సువాడ జూనియర్ కళాశాల వరకు బస్సులో ప్రయాణించి విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. తాము ఎటువంటి ప్రయాణ ఇబ్బందులు పడకుండా కాలేజీ వరకు వెళ్తున్నామని, తమ సమస్యపై స్పందించి తమ ప్రయాణ ఇబ్బందులను దూరం చేసిన ఎమ్మెల్యే పోచారంకు విద్యార్థినులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
