Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2025, 7:33 pm Posted by : ramakrishna

నిజాంసాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా సాగు నీరు

  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

 

నిజాంసాగర్, బతుకమ్మ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా సాగు నీరు ఉందని రెండు పంటలకు ధోకా లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. ఆయన మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం,నీటి నిల్వ,ఇన్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత 40 రోజులుగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి వరద గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల వివరాలను తెలుసుకున్నారు. నీటి పారుదల శాఖ ఈఈ సోలోమాన్ వివరాలను తెలియజేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం సింగూర్ ప్రాజెక్టు నుండి సుమారు ఒక లక్ష క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి దిగువకు 15 వరద గేట్లను ఎత్తి ఒక లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ముందు పీట వేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తామని తెలిపారు. మొదటి ఆయకట్టు నుండి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని పేర్కొన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయనతో రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకులూ మహమ్మద్ ఇలియాస్,జుక్కల్ నియోజకవర్గం యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ ఇమ్రోస్, నీటి పారుదల శాఖ ఏఈ సాకేత్ తదితరులు పాల్గొన్నారు.

Plenty of irrigation water in Nizamsagar project