Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 2:05 pm Posted by : ramakrishna

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీలు సక్సెస్

 

నిజామాబాద్ , బతుకమ్మ : 

 

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్లకు వేదికైంది. ఇటీవల హృద్రోగ వ్యాధిగ్రస్తులకు విజయవంతంగా చికిత్స చేసి జీజీహెచ్ లో ఇప్పుడు ఏకంగా ప్లాస్టిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి వైద్యులు సూపర్ స్పెషాలిటీ వైద్యానికి కేరాఫ్ అని చెప్పకనే చెప్పారు. కాస్లీ వైద్యాన్ని పేదలకు ఉచితంగా ధర్మాసుపత్రిలో అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలమౌతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొ.డా.నాగమోహన్ తెలిపారు. నిజామాబాద్ కు చెందిన మమత అనే రోగికి దీర్ఘకాలికంగా కాలు భాగంలో మానని గాయం (Chronic Non-Healing Ulcer) ఉండడంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జన్ డా.శివాని ఆధ్వర్యంలో Flap Cover, Split Thickness Skin Grafting  శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండి గాయం బాగా మానుతున్నట్లు వైద్యులు తెలిపారు.ఈ చికిత్స ద్వారా రోగి కాలును సంరక్షించడంతో పాటుసాధారణ జీవన విధానానికి తిరిగి చేరుకునే అవకాశం కలిగిందని పేర్కొన్నారు.

Plastic surgeries at government general hospital a success

గాంధారి మండలానికి చెందిన లచ్చవ్వ(45) ఎడమ చెంప భాగంలో (Basal Cell Carcinoma) వ్యాధి నిర్ధారణ కావడంతో ప్లాస్టిక్ సర్జన్ డా.శివాని ఆధ్వర్యంలో (Rotation Flap Reconstruction) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విభాగాధిపతి డా.విజయ్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉండి, కోలుకుంటున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నిజామాబాద్‌లో నిర్వహించిన మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ కేసు కావడం విశేషమని, ఈ విజయవంతమైన శస్త్రచికిత్సతో ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సేవలు మరింత విస్తరిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా  ఆసుపత్రి సూపరిండెంటెంట్ నాగమోహన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్య బృందాన్ని అభినందించి, భవిష్యత్తులో కూడా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.నిజామాబాద్‌లో అందుబాటులో ఉన్న ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ సేవల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు.