Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 9:03 pm Posted by : ramakrishna

కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్

 

. . . అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

కుటుంబ సభ్యులంతా కలిసి పిక్‌పాకెటింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బస్సుల్లో రద్దీని ఆసరాగా చేసుకుని ప్రయాణికుల సెల్‌ఫోన్లు, నగదును అపహరిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కవిత (ఏ1), నాగమణి (ఏ2), ప్రసాద్ (ఏ3) కలిసి పిక్‌పాకెటింగ్‌కు పాల్పడుతున్నారు. బస్సుల్లో రద్దీగా ఉన్న సమయంలో ప్రయాణికులపై నిఘా పెట్టి, వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, నగదును చోరీ చేసేవారని పోలీసులు తెలిపారు. ఇటీవల ఓ చోరీకి పాల్పడిన అనంతరం మరుసటి రోజే అదే ప్రాంతానికి మరోసారి వచ్చిన నిందితులపై టూ టౌన్ పోలీసులకు అనుమానం రావడంతో నిఘా పెట్టారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఆటోరిక్షా, రూ.3 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై ఇప్పటికే పలు జిల్లాల్లో సుమారు 16 పాత కేసులు ఉన్నట్లు టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి తెలిపారు. జిల్లా డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో, సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగింది. టూ టౌన్ ఎస్సై డి. సైదా బాబు, మహిళా ఎస్సై మానస, కానిస్టేబుళ్లు బాలకోటి, షకిల్ తదితరులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన టూ టౌన్ పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. రద్దీ ప్రాంతాలు, బస్సుల్లో ప్రయాణించే సమయంలో ప్రజలు తమ సెల్‌ఫోన్లు, నగదు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.