Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 9:19 pm Posted by : ramakrishna

సమాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి

 

. . . మసాయిపేట యాదగిరి మాదిగ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మత దురహంకారం, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ శ్రేణులు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మసాయిపేట యాదగిరి మాదిగ పిలుపునిచ్చారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ కోసం రాజీలేని పోరాటం సాగించిందని తెలిపారు. మాదిగలతో పాటు పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి పలు సంక్షేమ పథకాలను సాధించడంలో ఉద్యమం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి బలమైన ప్రజా పోరాటాలను నిర్మించాలని ఆయనన్నారు. మహనీయుల ఆశయాలు, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని, అన్ని గ్రామాలు, బస్తీల్లో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా యాదగిరి మాదిగ మాట్లాడుతూ, దేశంలో కొనసాగుతున్న కుల వ్యవస్థ కారణంగా అనేక వర్గాలు వివక్షకు గురై పేదరికంలోనే మిగిలిపోయాయని అన్నారు. అణగారిన వర్గాల ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం నిరంతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాజకీయ చైతన్యాన్ని కోల్పోకుండా ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్మించాలని కార్యకర్తలకు సూచించారు. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ విభాగాల కమిటీలు రద్దైన నేపథ్యంలో గ్రామ, పట్టణ స్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేసి సంస్థాగతంగా పునర్నిర్మాణం చేపట్టాలని ఆయన తెలిపారు. నూతన విద్యార్థి, యువతను ఉద్యమంలోకి తీసుకువచ్చి శక్తివంతమైన శ్రేణులుగా తీర్చిదిద్దేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశానికి ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ నిజామాబాద్ అర్బన్ ఇన్‌చార్జి సరికేల పోశెట్టి మాదిగ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కో-ఇన్‌చార్జిలు పేదిగిరి మహేష్, తేడు గంగారాం, రేణిగుంట నాంపల్లి, జిల్లా మహిళా నాయకురాలు గుంట పద్మ, రాహుల్, రాజేష్, నవీన్, యాదగిరి, రూరల్ ఇన్‌చార్జి నాగభూషణం, నిజామాబాద్ ఉమ్మడి విద్యార్థి ఇన్‌చార్జి బైరిపోగు శివ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

 

People's movements must be strengthened with the goal of building an egalitarian society.