Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 6:47 pm Posted by : ramakrishna

ఎల్ పీజీ గ్యాస్ కొరత పై ప్రజలు అపోహలకు గురి కావద్దు

 

. . . రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో ఎల్‌పి.జి గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు అపోహలకు గురికాకూడదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ, అమెరికా – ఇరాన్ యుద్ధ పరిస్థితులను కారణంగా చూపుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న గ్యాస్ కొరత ప్రచారం పూర్తిగా అవాస్తవం అని అన్నారు. రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 810 ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుండగా, మొత్తం కోటి 29 లక్షల ఎల్‌పిజి కనెక్షన్లు ఉన్నాయని, రోజుకు సగటున 2.5 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అయితే అపోహల కారణంగా ప్రస్తుతం బుకింగ్స్ 72 శాతం వరకు పెరిగినట్లు పేర్కొన్నారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. అపోహలను ఆసరాగా చేసుకుని గ్యాస్ నిల్వ చేయడం, మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే, ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 288 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లాల వారీగా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి మాత్రమే ఎల్‌పిజి బుకింగ్ చేయాలని వినియోగదారులకు సూచించారు. అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయకుండా అపోహలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీవెన్ రవీంద్ర పాల్గొనగా, నిజామాబాద్ కలెక్టరేట్ నుండి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, అరవింద్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

People should not be misled about LPG gas shortage