. . . మాక్లూర్ పీ.ఎస్ పరిధిలో ఇఫ్తార్ విందులో పోలీస్ కమీషనర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు. మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రం లో గల అరిఫా ఫాతిమా మసీద్‌లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కమిటీ నిర్వహించిన దువాలో సీపీ పాల్గొని, అనంతరం ఉపవాస విరమణ చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ ఎస్ ఐ ఎమ్. రాజశేఖర్, ఎండీ అహ్మద్ మజీద్ సదర్, తాజద్దీన్ (తెలికామ్ డైరెక్టర్), ఇలియాస్ భాయ్, అబ్దుల్ కరీం, అర్షద్ రహేమాత్ అలీ, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సీపీ హాజరుకావడం పట్ల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
