Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:22 pm Posted by : ramakrishna

ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలి

 

. . . ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

 

. . . డీఐజీ ఆర్. భాస్కరన్

 

బోధన్, బతుకమ్మ :

 

ప్రజలకు మరింత సమర్థవంతమైన, స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జోన్–II బాసర డీఐజీ ఆర్. భాస్కరన్ సూచించారు. శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న డీఐజీకి పోలీసు అధికారులు, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి, వాటిని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రిసెప్షన్ సెంటర్‌ను సందర్శించిన డీఐజీ అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంగా స్వాగతించి, వారి సమస్యలను ఓర్పుతో విని, ఫిర్యాదు అందిన వెంటనే త్వరితగతిన స్పందించాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, అత్యవసర సహాయం కోరుతూ వచ్చే వారి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

 

People-friendly policing must be provided.

 

. . . పెండింగ్ కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి

పోలీస్ స్టేషన్‌లోని అన్ని రకాల రికార్డులను పరిశీలించిన డీఐజీ కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా తదితర అంశాలను సమీక్షించారు. అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని, నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దర్యాప్తులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.

. . . సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌పై అవగాహన

బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని డీఐజీ సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా సైబర్ క్రైమ్‌పై ప్రచారం చేయాలని తెలిపారు. సులభంగా అధిక డబ్బు సంపాదించాలనే ఆశతో యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమింగ్ యాప్‌లకు ఆకర్షితులై సైబర్ మోసగాళ్ల బారినపడి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమింగ్ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతను నిరంతరం చైతన్యపరచాలని, అన్ని గ్రామాల్లో డ్రగ్స్ వినియోగం నిషేధంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

 

People-friendly policing must be provided.

 

. . . సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేయాలి

బోధన్ పోలీస్ స్టేషన్ పరిధి మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్నందున ప్రధాన రహదారులపై నిఘాను మరింత పటిష్టం చేయాలని డీఐజీ సూచించారు. గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఆయా ప్రాంతాల్లోని ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పైస్థాయి అధికారులకు చేరవేయాలని సూచించారు.

. . . ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు

ప్రతిరోజూ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపట్టి ట్రాఫిక్ సమస్యలను అధిగమించాలని డీఐజీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు చైతన్యం కల్పించాలని తెలిపారు. స్టేషన్‌లో అమలవుతున్న ‘5 ఎస్ విధానం’ను కూడా డీఐజీ సమీక్షించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల డిజిటల్ నిర్వహణ, సిబ్బంది హాజరు, డ్యూటీ విధానాలను పరిశీలించారు. పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా క్రమశిక్షణతో, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. ఈ తనిఖీలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్, బోధన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ, బోధన్ ట్రాఫిక్ ఎస్‌ఐ మహేష్, బోధన్ టౌన్ ఎస్‌ఐ హబీబ్ ఖాన్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

People-friendly policing must be provided.