నిజామాబాద్, బతుకమ్మ :
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బిసి బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు పెట్రోల్ బంక్ లు వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసి ఉంచారు. ఆర్టీసీ బస్టాండ్ ల, డిపో ల వద్ద బిసి సంఘాలు శనివారం తెల్లవారుజామున ఆందోళన చేపట్టారు. రాజకీయ, విద్యార్థి, యువజన సంఘాల తో పాటు కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ ల సాధనకు చేపట్టిన బంద్ కు అధికార కాంగ్రెస్ పార్టీ, బిజేపి, బిఆర్ఎస్ లు మద్దతు తెలుపడంతో బంద్ కు ప్రజల నుంచి స్పందన లభించింది.శాంతియుత వాతావరణంలో బంద్ జరుగుతుండటంతో పోలీస్ శాఖ అవాంఛనీయ సంఘటనలు తావు ఇవ్వకుండా భద్రత చర్యలు చేపట్టింది. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచి బంద్ ప్రభావం సామాన్యులపై పడింది.

డిపోవద్ధ నిరసనలో ఎమ్మెల్సీ బల్మూరి వేంకట్
నిజామాబాద్ 1 వ ఆర్టీసీ డిపో వద్ద బిసి కులాల జేఏసీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పరిశీలకులు, ఎమ్మెల్సీ బల్మూరి వేంకట్ పాల్గొని మద్దతు తెలిపారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్ ల విషయంలో కాంగ్రెస్ పార్టి చిత్తశుద్ధిని శంకించవద్ధని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉందని అన్నారు. ఈ నిరసనలో బీసీ జేఏసీ చైర్మన్ పోతన్ కర్ లక్ష్మి నారాయణ, కో చైర్మన్ బొబ్బిలి నర్సయ్య, బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు రాజు, నాయకుడు మురళి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపూల్ గౌడ్, బిజెపి నాయకులు అంబదాస్ రావు, కాంగ్రెస్ ఓబిసీ అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
