నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ కళాశాల లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పీ డీ ఎస్ యూ కళాశాల కమిటీ ఆధ్వర్యంలో గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రావు కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా పీ డీ ఎస్ యూ కళాశాల కమిటీ కార్యదర్శి నసీర్, ఉపాధ్యక్షులు వినోద్ లు మాట్లాడుతూ గిరిరాజ్ కళాశాలలో ప్రతి కోర్సు కు సంబంధించిన పుస్తకాలు లైబ్రరీలో విద్యార్థుల సంఖ్యకు తగినట్లు సదుపాయం కల్పించాలన్నారు. దాదాపు మూడు వేల మంది విద్యార్థులు చదువుకోడానికి వస్తే వారికి కేవలం ఐదు టాయిలెట్స్ ఉండడం బాధాకరమన్నారు. వెంటనే విద్యార్థులు సరిపడా టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించాలన్నారు. గిరిరాజ అనే వ్యక్తి ద్వారా తీసుకున్న భూమి చుట్టూరా ప్రహరీ గోడ నిర్మించి కబ్జాదారుల నుంచి కాపాడాలన్నారు. రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యార్థులకు బోధించడానికి సరిపడా లెక్చరర్స్ లేకపోవడం విద్యార్థులను చదువుకు దూరం చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే సరిపడా లెక్చరర్స్ నియమించి విద్యా బోధన అందించాలని కోరారు. వందలాది విద్యార్థులు ఉంటే కేవలం ఒక క్లాస్ రూమ్ లో మాత్రమే ల్యాబ్ ఫెసిలిటీ ఉండడం దారుణమన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా ల్యాబ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుండి సహాయం రాకపోవడం, ఉన్న గిరిరాజ్ కళాశాల భవనన్నైనా కాపాడుకావాలని, భవనం మీద చుట్టూరా ఉన్న చెట్లను, కలుపు మొక్కలను తీసివేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా సమస్యలు పరిష్కారం కాకుంటే ఉద్యమం చేపడుతారని కళాశాల ప్రిన్సిపల్ కి తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యూ గిరిరాజ కళాశాల నాయకులు సృజన్, అజయ్, కిరణ్,ధీరజ్, భీమేష్,అరవింద్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.