Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 5:52 pm Posted by : ramakrishna

బాల అభిమాని నిరంజన్ ని పరామర్శించిన పవన్ కళ్యాణ్

 

. . . వైద్య సహాయంతో పాటు జీవనోపాధికి భరోసా

 

హన్మకొండ, బతుకమ్మ :

 

వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ తనను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూసిన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. నిరంజన్ కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆయన బుధవారం హన్మకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు.

 

Pawan Kalyan calls on young fan Niranjan.

 

ఈ సందర్భంగా నిరంజన్ చూపుతున్న అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య కూడా నిరంజన్ ప్రదర్శిస్తున్న మనోధైర్యం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నిరంజన్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.

 

Pawan Kalyan calls on young fan Niranjan.

 

అలాగే భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు నిరంజన్‌పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, భగవంతుని కృపతో అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిరంజన్ తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, వారి కుమారుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. అంతేకాకుండా నిరంజన్ తల్లిదండ్రుల వృత్తి వివరాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్, గతంలో వారు కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్‌లో పనిచేసేవారని తెలుసుకుని వారి జీవనోపాధి మెరుగుపడేలా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేశారు.

 

Pawan Kalyan calls on young fan Niranjan.

 

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు తన హన్మకొండ పర్యటనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆశీర్వాదాలు తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. “ప్రియమైన నిరంజన్… నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా సందేశం ఇచ్చారు.

 

Pawan Kalyan calls on young fan Niranjan.