Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 January 2025, 8:02 pm Posted by : ramakrishna

వ్యవసాయంపై కక్ష.. రైతులకు మరణశిక్ష

  • అన్నదాతల ఆత్మహత్యలన్నీ సర్కార్ హత్యలే
  • కాంగ్రెస్ దగాకోరు పాలనతో తల్లడిల్లుతున్న తెలంగాణ
  • రేవంత్ మోసం వల్లే రైతుల ఆత్మహత్య లు
  • మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయంపై కక్షగట్టి రైతులకు మరణశిక్ష విధిస్తోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది దాటిన దగాకోరు పాలనతో ఇప్పటికే దాదాపు 402 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ అన్నదాతల ఆత్మ హత్యలన్నీ సర్కార్ చేసిన హత్యలేనని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు.  కాంగ్రెస్ అవినీతికర, అవకాశవాద పాలనతో తెలంగాణ రాష్ట్రం తల్లడిల్లు తోందన్నారు. రేవంత్ మోసం వల్లే రైతులు బలిపీఠమెక్కుతున్నారన్నారు.రుణమాఫీ,రైతు బంధు,మద్దతు ధర లేకపోవడంతో అన్నదాతలు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు తెలంగాణ లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పల్లెల్లో చావుడప్పులు మోగుతుంటే ప్రభుత్వం  మాత్రం ఏమీపట్టనట్లు మొద్దు నిద్ర నటిస్తోంది. కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చితే, రేవంత్ రెడ్డి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించకుండా పోలీస్ యాక్ట్ (30 యాక్టు) పేరుతో జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నించే గొంతులను పిసికేస్తున్నారు. రుణమాఫీ జరగకపోవడంతో రైతులు కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ విసిగి పోతున్నారు.  భూములు కుదవ పెట్టి అప్పులు తెచ్చు కుంటున్నారు. ఆ అప్పులు చెల్లించలేక చివరికి ఆత్మహత్యలు చేసు కుంటున్నారన్నారని ఆయన పేర్కొన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదన్న గత అనుభవాలను కాంగ్రెస్ పాలకులు పూర్తిగా మరిచి పోయినట్లున్నారన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు  ఆత్మ హత్యలు చేసు కోవద్దని, ఆత్మహత్యలు పరిష్కారం కాదని, బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని, త్వరలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయి మంచిరోజులొస్తాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా అందరికీ రుణమాఫీ, రైతు భరోసా, అన్ని పంటలకు 500 బోనస్ హామీలు అమలు చేసే దాకా సర్కారును వడలబోమని ఆయన  హెచ్చరించారు. కాగా,రైతుల ఆత్మ హత్యలపై బీఆర్ఎస్ చేయతలపెట్టిన అధ్యయనానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవడం దారుణమని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ రైతులకు అండగా నిలిస్తే సర్కారుకెందుకు కడుపునొప్పి అని జీవన్ రెడ్డి నిలదీశారు.