Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 7:22 pm Posted by : ramakrishna

కుల గణనపై పార్టీలు తమ అభిప్రాయం తెలపాలి

 

. . . తెలంగాణ జాగ్రతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

కుల గణనపై అన్ని పార్టీలు కూడా తమ స్టాండ్ ఏంటో చెప్పాలని తెలంగాణ జాగ్రతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాతీయ జన గణన, కుల గణన అంశాలపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనగణన, కుల గణనపై ఎక్సర్ సైజ్ జరుగుతోందన్నారు. నిజానికి పదేళ్లకు ఒకసారి జనగణన చేయాల్సి ఉండగా కోవిడ్ కారణంగా 2021 లో గణన చేయలేదన్నారు. కులగణనపై అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ రావడంతో కేంద్రం అందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. కులగణన చేయాలన్న బుద్ది బీజేపీ నుంచి రావడం మమ్మల్ని ఆశ్చర్యపరిచిందన్నారు. జనగణన చేసినపుడే ఏ  వర్గం ఎంత ఉంది, వారికి బడ్జెట్, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయన్నది తెలుస్తుందని చెప్పారు. కుల గణనకు కేంద్రం ముందుకు రావడంతో సంతోషించామన్నారు. కానీ ఎప్పుడైతే డాక్యుమెంట్ విడుదల చేశారో అప్పుడే వాళ్ల బుద్ది బయట పడిందని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ ల కాలమ్ పెట్టారని పేర్కొన్నారు. దీని ద్వారా బీజేపీ భారత ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కులాల విషయంలో ఒక్కో రాష్ర్టంలో ఒక్కో విధంగా కులాలను పిలుస్తారని, తాను వెలమ కులస్తురాలినని, తెలంగాణలో ఓసీ, మహారాష్ట్రలో ఎస్సీ, ఏపీ లో బీసీనన్నారు. చిన్న సంఖ్యలో ఉన్న కులానికే ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయని, మరి 56 శాతం ఉన్న బీసీల విషయంలో ఎంత గంతరగోళం ఉంటుందో ఆలోచించాలన్నారు. గతంలో అగ్ర కులాల్లో పేదలకు రిజర్వేషన్లు ఇచ్చారని కవిత అన్నారు. వాళ్లు ఏ కేటగిరిలో వస్తారో చెప్పలేదన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని కమ్యూనిటీల వాళ్లు ఉన్నారని, మనం ఇచ్చే అభిప్రాయం రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి సూచికలా ఉండాలని తెలిపారు. బీజీ కులగణన విషయంలో ఇచ్చిన మాట తప్పినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణ నుంచి మన అభిప్రాయం కూడా ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని తెలిపారు. తెలంగాణలో ఉన్న కులాలు, వాటి ఉపకులాల నివేదిక జాగ్రతి సిద్దం చేస్తుందని చెప్పారు. నిజానికి ఈ పని ప్రభుత్వమే చేయాలని, కానీ వాళ్లకు చిత్త శుద్ది లేదన్నారు. అందుకే మేము అందరి అభిప్రాయాలని తీసుకోవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రతి పార్టీకి ఒక స్టాండ్ ఉండాలని, కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో ఏమీ మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్ పరిస్థితి అంతేనని వివరించారు. బీజేపీయే డాక్యుమెంట్ విడుదల చేసింది కాబట్టి వారు అందుకు మద్దతుగా మాట్లాడుతున్నారన్నారు. అన్ని పార్టీలు కుడా తమ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

Parties should express their views on caste census