Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2024, 5:38 pm Posted by : ramakrishna

గ్రామాల్లో పడకేసిన పంచాయతీ పాలన

  •  అస్తవ్యస్తంగా తయారైన మురికి కాలువలు
  •  ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం
  •  ప్రత్యేకాధికారుల పాలనలో పట్టించుకునే వారే కరువు

రుద్రూర్, బతుకమ్మ : గ్రామాలల్లో గల గ్రామ పంచాయతీ కార్యాలయాలల్లో పడకేసిన పంచాయతీ పాలన కొనసాగుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామంలో పారిశుద్యం నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని, డ్రైయినేజీల్లో రోజుల తరబడి పూడిక తీయకపోవడంతో చెత్త చెదారం పేరుకుపోయిందన్నారు. ఖాళీ ప్రదేశాల్లో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు నిండిపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని, దోమకాటుతో ప్రమాదకరమైన డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం పూర్తికాగా.. ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. అయితే ప్రత్యేకాధికారులు గ్రామాల్లో ఎక్కడా కన్పించడం లేదని చెబుతున్నారు. వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ పరిస్థితి కన్పించడం లేదన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల బెడద అధికంగా ఉందని, గ్రామంలో గ్రామపంచాయతీకి చెందిన చెత్త సేకరణ ట్రాక్టర్ రావడంలేదని, గ్రామ పంచాయతీ వద్దే ఉంటుందన్నారు. అస్తవ్యస్తమైన పారిశుద్యం పై గ్రామ సెక్రటరీకి పలుమార్లు విన్నవించిన కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి గ్రామాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Panchayat rule collapsed in villages