. . . నకిలీ చిట్టీలతో రూ.91 లక్షల కుంభకోణం బట్టబయలు
. . . సిరిసిల్లలో ధాన్యం కొనుగోలు అక్రమాలపై పోలీసుల మెరుపు దాడి
రాజన్న సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ :
రైతుల నుంచి సేకరించిన ధాన్యం ప్రభుత్వ గోదాంలకు చేరకుండానే పక్కదారి పట్టింది. నకిలీ ట్రక్ చిట్టీలు, తప్పుడు ఆన్‌లైన్ ఎంట్రీలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టిన అంతర్ – జిల్లా ముఠా వ్యవహారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ధాన్యం కొనుగోలు వ్యవస్థలో అక్రమాలకు పాల్పడి సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసును సిరిసిల్ల పట్టణ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గిత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాం కేంద్రంగా ఈ అక్రమాలకు పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. గోదాం మేనేజర్ ఉత్క్యం విజయ్, సూపర్‌వైజర్ వాసాల గణేష్ ప్రధాన పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు చూపిస్తూ నకిలీ ట్రక్ చిట్టీలు తయారు చేసి, వాటిని సివిల్ సప్లైస్ ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి రెండు లారీల ధాన్యానికి నకిలీ చిట్టీలు ఇచ్చినట్లు గుర్తించారు. వాటిని ఉత్క్యం విజయ్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం నుంచి మరో లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ చిట్టీ తయారు చేసినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్ కమ్మరి రాజశేఖర్, పీఏసీఎస్ ఇన్‌చార్జ్ గాజుల నవీన్ పాత్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో అత్యంత సంచలన విషయం ఏమిటంటే.. 10 లారీల ధాన్యం అసలు గోదాంకు చేరకపోయినా, రికార్డుల్లో మాత్రం దిగుమతి అయినట్లు చూపించారు. తర్వాత ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చేపురి మధుకర్‌కు అప్పగించి, సిద్దిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి పోలీసులు రూ.14,16,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.46,21,358 నిధులను ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ఉత్క్యం విజయ్, కమ్మరి రాజశేఖర్, చేపురి మధుకర్, వాసాల గణేష్, గాజుల నవీన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొందరిపై దర్యాప్తు కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మహేష్ బి. గిత్ హెచ్చరించారు. రైతుల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని పోలీసులు స్పష్టం చేశారు.