Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 December 2024, 3:53 pm Posted by : ramakrishna

పడకేసిన పల్లె ప్రకృతి వనాలు

  •  ఏదో మొక్కలు నాటమా.. వదిలేశామా?..
  •  ఆహ్లాదం ఎక్కడ..?
  •  ప్రజా ధనం వృధా
  • పట్టించుకోని అధికారులు

రుద్రూర్, బతుకమ్మ  : ఏదో మొక్కలు నాటామా.. వదిలేశామా.. అన్నట్లుగా మండలంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నట్లు ప్రస్తుతం అధికారుల తీరు కనిపిస్తుంది. లక్షలు వెచ్చించి గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు కొన్ని గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచుతుంటే …. మరికొన్ని గ్రామాల్లో మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గల పల్లె ప్రకృతి వనంలో మొక్కలు పూర్తిగా ఎండిపోయి పడకేసిన పల్లె ప్రకృతి వనంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతోందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శలకు అప్పగించారు. మండలంలో పూర్తయిన పల్లె ప్రకృతి వనాలు మొదట్లో అందరి సహకారంతో పూర్తి చేశారు. అక్కడక్కడ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటినా.. నెలలో ఒకటి, రెండు సార్లు కూడా మొక్కలకు నీరందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, నీటి ట్యాంకర్ ను అందించిన నిరుపయోగంగా కనిపిస్తుంది. రోజుల తరబడి నీటిని సరఫరా చేయకపోవడంతో ఉన్న కాస్త మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఇటీవల కాలంలో గ్రామ సర్పంచ్ పదవీకాలం ముగియడంతో పల్లె ప్రకృతి వనాల నిర్వహణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ సిబ్బందికి అప్పగించింది. అడపాదడపా ఉన్నతాధికారుల పర్యటన చేస్తున్న సందర్భాల్లోనే మొక్కలకు నీళ్లు పోస్తూ.. ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ఆ తర్వాత అంతా షరా మాములుగా మారిపోతుంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో పల్లె ప్రకృతి వనాల పరిస్థితి అధ్వానంగా కనిపిస్తుంది. ఏదో ఊరు చివరన హడావుడిగా పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి వదిలేయడంతో.. అప్పుడే మైదాన ప్రాంతాలుగా మారిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించి పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Padakesina villages are natural forests