. . . టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మున్సిపల్ కార్మికులు, డ్రైవర్ లకు రక్షణ పరికరాలు, యూనిఫామ్ లు అందివ్వాలని టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఏవో కి టియుసిఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ కార్మికులకు రక్షణ పరికరాలు, సబ్బులు, నూనెలు, యూనిఫాంలు, పాదరక్షలు గత రెండు సంవత్సరాలుగా ఇవ్వడం లేదన్నారు. ఎండ, వాన, చలి కాలాల్లో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తరచు ప్రమాదాలకు సైతం గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు నివేదించినా పెడచెవిన పెట్టడం సరికాదన్నారు. వెంటనే రక్షణ పరికరాలు యూనిఫాంలు అందివ్వాలన్నారు. అదేవిధంగా మున్సిపల్ వాహనాలకు రిపేర్లు ఖర్చులు రోజుల తరబడి పెండింగ్లో పెట్టడంతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మెకానిక్ షెడ్ లో రిపేరు పరికరాలు లేకపోవడంతో డ్రైవర్లకు ఇబ్బంది కలగడమే కాక, కార్పొరేషన్ పై అదనపు భారం పడుతుందన్నారు. వెంటనే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా నాయకులు రవి కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.