. . . కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్
బాన్సువాడ, బతుకమ్మ :
నేను గానీ, పోచారం గానీ సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజల సేవే మా లక్ష్యం. నిరంతరం ప్రజల మధ్య ఉండి సేవ చేస్తున్నామని ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి, అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంపై ప్రేమాభిమానాలతో ఎన్నో అభివృద్ధి పనులు చేసి, కోట్ల రూపాయల నిధులు తెచ్చారని గుర్తు చేశారు. నీ నియోజకవర్గంలో నువ్వు ఏం చేశావో చెప్పు. నీ కుటుంబంలోనే నీ చెల్లెలి సమస్యలు తీర్చలేని నువ్వు ప్రజల సమస్యలు ఎలా తీరుస్తావు? అంటూ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజల అభిమానం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని బాలరాజ్ స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బాన్సువాడ లో ఈ నెల 11వ తేదీన జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్ పార్టీ 19 వార్డుల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పోచారంకు బొంద పెట్టడం కాదు… నీకు బొంద పెట్టే రోజు రాబోతోంది అంటూ కేటీఆర్‌ను హెచ్చరించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ 19 వార్డులు 19 గెలిచి చూపిస్తామని, దమ్ముంటే సవాల్‌కు రండి. మా అభివృద్ధిపై ప్రజలకు నమ్మకం ఉందని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గంగాధర్, మోహన్ నాయక్, గురు వినయ్, మహమ్మద్ పాషా తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.