Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 8:37 pm Posted by : ramakrishna

జీవన శైలి వ్యాధులను నియంత్రించడమే మన లక్ష్యం

 

. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జీవనశైలి వ్యాధులను నియంత్రించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.బి.రాజశ్రీ అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లోని అసంక్రమిత వ్యాధుల నియంత్రణ విభాగం ద్వారా జీవన శైలి వ్యాధుల నిర్ధారణ, చికిత్స, ఆన్ లైన్ ఎంట్రీ అంశాలపై సిహెచ్ సి లలో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు డిఎంహెచ్ఓ ఛాంబర్ లో శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్, క్యాన్సర్ లో ప్రధానంగా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ వంటి వాటికి ఏ విధంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలో, ఏ విధంగా చికిత్స అందించాలో, ఏ విధంగా ఆన్ లైన్ ఎన్సిడి యాప్ లో నమోదు చేయాలో తెలిపారు. ఎన్సీడీకి సంబంధించి రోజువారి స్ప్రెడ్షీట్ డాటాలను ఎంట్రీ చేయాలని తెలిపారు. అదే విధంగా క్యాన్సర్ లో ఓరల్ క్యాన్సర్ నిర్ధారణ కోసం ముందస్తుగా త్రీ ఫింగర్ టెస్టును, బ్రెస్ట్ క్యాన్సర్ ముందస్తు నిర్ధారణ కోసం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ని చేసుకోవాలని, గర్భాశయముఖ ద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం వీఐఏ పరీక్షను చేసుకోవాలన్నారు. జీవనశైలి మార్పుల్లో భాగంగా ఉప్పు, నూనె ను తగ్గించాలని, శారీరక శ్రమ లేదా ఎక్సర్ సైజ్ చేయాలని, ప్రతి రోజు 30 నిమిషాలు నడక లేదా వారానికి 150 నిమిషాల నడక చేయాలన్నారు. పాన్ పరాగ్, గుట్కా, టొబాకో, ఆల్కహాల్ తీసుకోరాదని తెలియజేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ కేసులు అన్నింటిని ఎన్సిడి యాప్ లో ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. ఎన్ సి డి యాప్ ద్వారా నిర్ధారణ పరీక్షలను, నిర్ధారించిన కేసుల వివరాలను, అందించిన చికిత్సను, మందుల స్టాకును, మందుల కోసం ఇండెంట్ ను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిసి పి.వెంకటేష్, డిహెచ్ఈ గన్ పూర్ వెంకటేశ్వర్లు, వివిధ సిహెచ్ సి ల నుండి వచ్చిన నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.