. . . యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి
. . . జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలోని గండ్ర క్రికెట్ మైదానంలో రితేష్ పటేల్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన జన ఔషధీ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. వివిధ ప్రాంతాలకు చెందిన క్రికెట్ జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నాయి. ఆర్మూర్‌కు చెందిన సల్లు క్రికెట్ అకాడమీ,కామారెడ్డికి చెందిన ఆర్ సీసీఏ అకాడమీ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో సల్లు క్రికెట్ అకాడమీ విజయం సాధించి టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతగా నిలిచిన సల్లు క్రికెట్ అకాడమీకి ట్రోఫీతో పాటు జట్టు క్రీడాకారులకు మెడల్స్ అందించారు. ఈ టోర్నమెంట్లో ఆద్యంతం నిలకడగా రాణించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కార్తికేయ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా, ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన లక్ష్మీనివాస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు. వారికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని,విజయం సాధించిన వారు మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని, ఓటమి పాలైన వారు నిరుత్సాహపడకుండా పట్టుదలతో సాధన చేయాలని సూచించారు. యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే మనస్తత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
. . . జన ఔషధీ సేవలు వినియోగించుకోవాలి
ప్రజలకు నాణ్యమైన మందులను అతి తక్కువ ధరలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ పరియోజన ప్రజారోగ్య రంగంలో గొప్ప మార్పుకు నాంది పలికిందని పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. కేవలం ఆరోగ్య రంగానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజాసేవతో పాటు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం జన ఔషధీ వేదికగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
. . . రితేష్ పటేల్ కృషి అభినందనీయం
రితేష్ పటేల్ చొరవతో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని పల్లె గంగారెడ్డి అన్నారు. స్థానిక క్రీడాకారులకు మంచి వేదిక కల్పిస్తూ, వివిధ ప్రాంతాల జట్ల మధ్య పోటీలు నిర్వహించడం ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించడంలో రితేష్ పటేల్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా మరిన్ని క్రీడా,సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్ విజయవంతానికి సహకరించిన నిర్వాహకులు, క్రీడాకారులు, సహకరించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.