Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 7:16 pm Posted by : ramakrishna

వడ్డెర హక్కుల సాధనకు సంఘటిత ఉద్యమాలు అవసరం

 

. . . జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు ఫీట్ల శ్రీధర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

వడ్డెర సమాజం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం సంఘటితంగా ఉద్యమించాలని జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు ఫీట్ల శ్రీధర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన జాతీయ వడ్డెర సంఘం నిజామాబాద్ – కామారెడ్డి ఉమ్మడి జిల్లా అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వడ్డెర సమాజం ఇప్పటికీ విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటోందని, హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేపట్టాలని అన్నారు. జాతీయ సలహాదారు దండి వెంకట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో వడ్డెర ప్రజల సేవలను ప్రభుత్వాలు గుర్తించి, విద్య, ఉపాధి, భూమి, గృహాలు, సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి రంగాల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వడ్డెర సమాజానికి రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం అవకాశాలు ఇవ్వాలని కోరారు. యువత విద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధిలో ముందుకు రావాలని, మహిళలు నాయకత్వంలో భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా నాయకులు పల్లపు మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు ఎత్తరి రాములు, జిల్లా అధ్యక్షులు ఆర్. నర్సింహులు, ప్రధాన కార్యదర్శి భక్తుల శంకర్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్లా ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Organized movements are essential to secure the rights of the Vaddera community.