. . . 8 జిల్లాలో తేలికపాటి వర్షం
. . . సంగారెడ్డిలో మోస్తారు వర్షం కురిసే అవకాశం
హైదరాబాద్, బతుకమ్మ :
ఎండాకాలం ప్రారంభంలోనే వాతావరణం మార్పులు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 15న ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసాయి. ఈ నెల 23 వరకు తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెల్సిందే. సోమవారం తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ గా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదివారం కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో ఒక మోస్తరు వర్షం కురిసిన విషయం తెల్సిందే. అకాల వర్షం వల్ల కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. అంతేగాకుండా వరి పొట్ట దశలో ఉండగా నేలరాలింది. మంగళవారం తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, మెదక్, మేడ్చల్ – మల్కాజ్ గిరి, నిజామాబాద్, రాజన్నసిరిసిల్లా జిల్లా, వికారాబాద్ జిల్లాలో రానున్న రెండు గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలో రానున్న రెండు, మూడు గంటల్లో మోస్తారు వర్షం కురియనుంది. గంటకు 41 నుంచి 61 కిలో మీటర్ల మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో మోస్తారు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం ఉత్తర తెలంగాణలో అత్యధికంగా 36 డిగ్రీల ఎండకాచింది. కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగలు ఎండవేడమితో ఉక్కపోతల పాలైన ప్రజలకు సాయంత్రం తర్వాత కురిసిన అకాల వర్షాలు ఉపశమనానికి ఇచ్చిన పంటలకు మాత్రం నష్టాన్ని చేకూర్చుతున్నాయి. మరో మూడు రోజులు అకాల వర్షాల కష్టాలు ఉండడంతో వాతావరణ శాఖ రైతులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మార్కెటింగ్ అధికారులు కూడా వాతావరణ శాఖ సూచనలు పరిగణలోకి తీసుకుని వ్యవసాయ మార్కెట్లకు తీసుకువచ్చే పంటలను జాగ్రత్తగా తీసుకోవాలని కోరారు.