Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:04 pm Posted by : ramakrishna

నిజామాబాద్‌లో ‘ఆపరేషన్ ముస్కాన్–XII’ ప్రారంభం

 

. . . తప్పిపోయిన, నిరాశ్రయ చిన్నారుల గుర్తింపు, పునరావాసమే లక్ష్యం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తప్పిపోయిన, నిరాశ్రయ, వీధి బాలలు, బాల కార్మికులుగా మారే ప్రమాదంలో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్–XII’ కార్యక్రమాన్ని బుధవారం అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అదనపు డీసీపీ, జూలై 1 నుంచి జూలై 31, 2026 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చిన్నారులను గుర్తించి రక్షించే చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, బాలల సంరక్షణ విభాగం, జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్‌లో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మార్కెట్లు, హోటళ్లు, ఢాబాలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, గ్యారేజీలు, వర్క్‌షాపులు, నిర్మాణ ప్రాంతాలు, ధార్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు తదితర ప్రజా ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి బాల కార్మికులు, నిరాశ్రయ బాలలు, వీధి బాలలు, తప్పిపోయిన చిన్నారులను గుర్తించి రక్షించి, సంబంధిత అధికారుల సమక్షంలో పునరావాసం కల్పించనున్నట్లు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు ప్రతి చిన్నారికి విద్య, భద్రత, ఆరోగ్యం, రక్షణ కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు డీసీపీ పేర్కొన్నారు. చిన్నారులను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి ఘటనలు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించేందుకు నిజామాబాద్ డివిజన్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ (8712578236), ఆర్మూర్ డివిజన్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ (8712659863), బోధన్ డివిజన్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ (9985197899)లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ పాండేరావు, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ ఏ. సురేష్, జిల్లా వెల్ఫేర్ అధికారి, మహిళా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ డి. సౌందర్య, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ చైతన్య, జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సిహెచ్. ప్రభుదాస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కల్పన, డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం ప్రతినిధి వెంకటేష్, జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్ బి. భాస్కర్, జిల్లా విద్యాశాఖ ప్రతినిధి బి. బాలకృష్ణారావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

‘Operation Muskaan-XII’ launched in Nizamabad