. . . ఇద్దరు అరెస్ట్
కామారెడ్డి, బతుకమ్మ :
ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో పెట్టుబడులు పెట్టిస్తామని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టును కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలానికి చెందిన భూక్య నవీన్ అలియాస్ నరేష్ (26) విదేశాల్లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసే సమయంలో Future9.com అనే ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించాడు. అనంతరం స్వదేశానికి వచ్చిన అతడు వాట్సాప్ ద్వారా పలువురికి గేమింగ్ లింకులు పంపిస్తూ నెట్‌వర్క్‌ను విస్తరించాడు. పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి బాధితుల పేర్లతో యూజర్ ఐడీలు సృష్టించేవాడు. వెబ్‌సైట్‌లో నేరుగా చెల్లింపులు చేయలేని వారి నుంచి తమ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు స్వీకరించి, ఆ మొత్తాన్ని వెబ్‌సైట్‌లో జమ చేసేవారు. ఇందుకు వారికి ఐదు శాతం కమిషన్ లభించేదని విచారణలో తేలింది. ఈ వెబ్‌సైట్ ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది మోసపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. విశాఖపట్నం వెళ్లేందుకు కామారెడ్డి బస్టాండ్ వద్ద ఉన్న సమయంలో నిందితులు భూక్య నవీన్ అలియాస్ నరేష్‌తో పాటు భూక్య ప్రవీణ్ (23)ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక హెచ్‌పీ ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, రామారెడ్డి ఎస్‌ఐ మురళి, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ నరేష్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్పీ సూచనలు చేస్తూ సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్‌ల ద్వారా వచ్చే గుర్తుతెలియని లింకులు, ఆన్‌లైన్ గేమింగ్, ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు వస్తాయనే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని కోరారు.
