నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :పదహారు సంవత్సరాల బాలుని మృతికి కారణమైన ముద్దాయి షేక్ సర్దార్ అహ్మద్ కు రెండు నేరాలలో సంవత్సరం చొప్పున, మరొక కేసులో వేయి రూపాయల జరిమానా విధిస్తు నిజామాబాద్ స్పెషల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్(జూనియర్ సివిల్ జడ్జి) వడ్డి హరి కుమార్ మంగళవారం తీర్పు వెలువరించారు.వివరాలు నిజామాబాద్ నగరంలోని నాగారం 80 క్వార్టర్స్ కు చెందిన షేక్ కలందర్ తన బంధువైన పదహారు సంవత్సరాల షేక్ థౌఫిక్ తో కలిసి ఆటో డ్రైవ్ చేసుకుంటు నాగారం నుండి రహదారిపై రాగా ఇంద్రపూర్ దగ్గర వర్ని చౌరస్తా నుండి అతివేగంగా, అజాగ్రత్తగా ఆటో డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన డ్రైవర్ షేక్ సర్దార్ అహ్మద్, కలందర్ ఆటోకు టక్కర్ ఇవ్వగా అందులో ప్రయాణిస్తున్న కలందర్ కు,థౌఫిక్ గాయాలయ్యాయి. థౌఫిక్ ను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యచికిత్స పొందుతూ థౌఫిక్ మృతి చెందారు. ఆక్సిడెంట్ చేసిన ఆటోలో ఉన్న కల్లూరి సంతోష్ తీవ్ర గాయాల పాలయ్యారు.నేర న్యాయ విచారణలో బాగంగా సాక్షుల సాక్ష్యాలు నమోదు చేసుకుని, దృవీకరించుకున్న పత్రాలు మార్క్ చేసిన న్యాయమూర్తి ముద్దాయి షేక్ సర్దార్ అహ్మద్ పై ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్304 ఏ (అజాగ్రత్తగా, అతివేగంగా మోటారు డ్రైవ్ చేయడం మూలంగా ఒకరు మృతి చెందినందున)నేరంకు గాను ఒక సంవత్సరం జైలుశిక్ష, మరొక వ్యక్తి తీవ్రమైన గాయాలపాలు చేసినందుకుగాను సెక్షన్ 338 నేరంకు గాను మరొక సంవత్సరం జైలుశిక్ష ఖారారు చేశారు.రెండు శిక్షలు ఏకకాలంలో అనుభ వించాలని జడ్జి హరి కుమార్ తమ తీర్పులో పేర్కొన్నారు.మోటారు వాహనాల చట్టం సెక్షన్180 ప్రకారం వేయి రూపాయల జరిమానా విధించారు. ఆటో యజమాని అయిన మహమ్మద్ గౌసోద్దీన్ అనధికార వృక్తి కి ఆటోను ఇచ్చినందుకుగాను వేయి రూపాయల జరిమానా విధించారు.